డ్రగ్స్‌ కేసులో రకుల్‌ విచారణ

26 Sep, 2020 02:23 IST|Sakshi
ఎన్సీబీ విచారణకు వస్తున్న రకుల్‌

ఎన్సీబీ ముందు హాజరైన నటి; 4 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు

నేడు దీపిక విచారణ; సుశాంత్‌ కోసం సోదరుడితో డ్రగ్స్‌ తెప్పించిన రియా

ముంబై: మాదక ద్రవ్యాల కేసు విచారణలో భాగంగా ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ శుక్రవారం నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూర్డో(ఎన్సీబీ) ముందు హాజరయ్యారు. నటుడు సుశాంత్‌సింగ్‌ మృతి, తదనంతరం వెలుగు చూసిన తారల డ్రగ్స్‌ వినియోగం, సరఫరా కోణంలో ఎన్సీబీ విచారణ జరుపుతోంది. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి రకుల్‌ శుక్రవారం ఉదయం చేరుకున్నారు. ఆమెను ఎన్సీబీ అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు.  నటి దీపిక పదుకోన్‌ మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్, ధర్మ ప్రొడక్షన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ క్షితిజ్‌ రవిని కూడా ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు.

కరిష్మా ప్రకాశ్‌ను అధికారులు శనివారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు. దీపిక పదుకోన్‌ను శనివారం విచారించనున్నట్లు సమాచారం. క్షితిజ్‌ రవిని కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. రవి ఇంట్లో ఎన్సీబీ జరిపిన సోదాల్లో డ్రగ్స్‌ లభించినట్లు సమాచారం.  సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తిని విచారిస్తున్న సందర్భంగా రకుల్‌తో పాటు పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. సుశాంత్‌సింగ్‌  కోసం రియా తన సోదరుడు షోవిక్‌ చక్రవర్తి ద్వారా డ్రగ్స్‌ తెప్పించేదని ఎన్సీబీ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు.

అది నిజమేనని విచారణలో షోవిక్‌ కూడా అంగీకరించాడు. పారిహార్, కైజెన్‌ ఇబ్రహీంల నుంచి డ్రగ్స్‌ను సేకరించిరియాకు ఇచ్చేవాడినని తెలిపాడు. వాటితో రాజ్‌పుత్‌ మేనేజర్‌ సామ్యూల్‌ మిరండా, కుక్‌ దీపేశ్‌సావంత్‌ సిగరెట్లు తయారు చేసేవారని షోవిక్‌ చెప్పాడు. ఎన్సీబీ అధికారి వెల్లడించిన సమాచారం మేరకు.. రియా కుటుంబం పాల్పడిన నగదు అక్రమ రవాణా కేసు విచారణ సందర్భంగా ఈ డ్రగ్స్‌ కోణం ఈడీ దృష్టికి వచ్చింది. దాంతో, ఈడీ ఈ విషయాన్ని ఎన్సీబీ దృష్టికి తీసుకువెళ్లింది.

ఎన్సీబీ విచారణలో డ్రగ్స్‌ సరఫరాలో కీలకమైన జాయిద్‌ పాత్ర బయటపడింది. లాక్‌డౌన్‌ కారణంగా తన హోటెల్‌ బిజినెస్‌ దెబ్బతిన్నదని, అందువల్ల ఈ డ్రగ్స్‌ దందాలో దిగానని జాయిద్‌ ఎన్సీబీ విచారణలో వెల్లడించాడు. బాసిత్‌ పారిహర్‌ పేరు కూడా జాయిదే వెల్లడించాడు. అలాగే, కైజెన్‌ ఇబ్రహీంను విచారిస్తున్న సమయంలో డ్రగ్స్‌ సప్లైయర్‌ అనుజ్‌ కేశ్వానీ పేరు తెరపైకి వచ్చింది. బాంద్రాలోని ఆయన ఇంటిపై జరిపిన దాడిలో భారీగా చరస్, గంజాయి, టీహెచ్‌సీ, ఎల్సీడీ మాదకద్రవ్యాలు లభించాయి. రియా, షోవిక్‌ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు.

కరణ్‌ జోహార్‌ను కూడా?
పలువురు బాలీవుడ్‌ తారలు డ్రగ్స్‌ తీసుకున్నట్లు కనిపించిన ఒక వీడియోను అప్‌లోడ్‌ చేసిన ప్రముఖ దర్శకుడు కరణ్‌ జోçహార్‌ను కూడా ఎన్సీబీ విచారించనుందని శిరోమణి అకాలీదళ్‌ మాజీ ఎమ్మెల్యే మంజిందర్‌ సింగ్‌ సిర్సా తెలిపారు. చాలా కాలం క్రితం నాటి ఆ వీడియోను సాక్ష్యంగా చూపుతూ మంజిందర్‌ సింగ్‌ తాజాగా ఎన్సీబీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన ఎన్సీబీ ఆ వీడియో నిజానిజాలను నిర్ధారించేందుకు టెస్టింగ్‌కు పంపించింది.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు