నడుం, కాళ్లు విరిచి.. వరుస అఘాయిత్యాలు

1 Oct, 2020 08:59 IST|Sakshi

యూపీలో వరుస హత్యాచారాలు

బల్‌రామ్‌పూర్ లో సామూహిక అత్యాచారం

తీవ్రగాయాలతో బాధితురాలు కన్నుమూత

ఎనిమిదేళ్ల బాలికపై యువకుడి అఘాయిత్యం

సాక్షి, లక్నో : హత్రాస్ ఘటనపై ఒకవైపు దేశం అట్టుడుకుతూండగానే ఉత్తర ప్రదేశ్‌లో వరుస అకృత్యాలు కలకలం రేపుతున్నాయి. హత్రాస్ నుండి 500 కిలోమీటర్ల దూరంలోని బల్‌రామ్‌పూర్ జిల్లాలో మరో దళిత యువతి (22) సామూహిక హత్యాచారానికి బలైపోయింది. మత్తు మందు ఇచ్చి, నడుము, రెండు కాళ్లు విరిచేసి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. మరో ఘటనలో అజమ్‌గర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఎనిమిదేళ్ల  బాలికపై అత్యచారాం చేశాడో యువకుడు.  దీంతో రాష్ట్రంలో  నేరస్థుల ఆగడాలు, మహిళల భద్రతపై విమర్శలు చెలరేగుతున్నాయి.  (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!)

బల్‌రామ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా ఆమె నుంచి స్పందనలేదు.  దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో వెదకడం ప్రారంభించారు. ఇంతలో రాత్రికి అసాధారణ పరిస్థితిలో ఓ ఆటో రిక్షాలో అపస్మారక స్థితిలో యువతి ఇంటికి చేరింది. చేతికి గ్లూకోజ్ డ్రిప్ ఇంజెక్షన్, ఒంటి నిండా గాయాలు చూసి కుటుంబ సభ్యులు షాక్  అయ్యారు.  వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆమెను లక్నోకు తీసుకెళ్లమని వైద్యులు సలహా ఇచ్చారు.  కానీ  మార్గమధ్యలోనే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.  వీరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు బలరాంపూర్ ఎస్పీ దేవ్ రంజన్ వర్మ తెలిపారు.

అత్యాచారానికి ముందు తమ కూతురికి మత్తు ఇంజెక్షన్‌కు ఇచ్చి మరీ ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని బాధితురాలు తల్లి కన్నీటి పర్యంతమైంది. రెండు కాళ్లను విరిచేసి, శవంలాంటి తన బిడ్డను పంపారని వాపోయింది.  ఐతే పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను తోసి పుచ్చారు. పోస్ట్ మార్టం నివేదికలో ఈ విషయాలేవీ తేలలేదని  బలరాంపూర్ పోలీసులు గత రాత్రి ట్వీట్ చేశారు. 

అజమ్‌గర్ ఘటనలో జియాన్పూర్ ప్రాంతంనుంచి ఎనిమిదేళ్ల బాలికను తీసుకువెళ్లిన యువకుడు అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తీవ్ర రక్తస్రావంతో, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. నిందితుడు  దినేశ్‌ను అరెస్టు చేశామని అజమ్‌గర్  ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ తెలిపారు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు