మచ్చిక చేసుకొని ముంచేస్తారు

1 Aug, 2020 13:22 IST|Sakshi

సోషల్‌ మీడియాపై నేరగాళ్ల కన్ను

పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలు

ఆకర్షణీయమైన ప్రకటనలతో ఎర

లక్షల్లో నష్టపోతున్న ప్రజలు 

టెక్నాలజీతో ఛేదిస్తున్న పోలీసులు 

కరీంనగర్‌క్రైం: ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌..అత్యవసరంగా డబ్బు అవసరముంటే వివిధ యాప్‌ల రూపంలో క్షణాల్లో అకౌంట్లోకి బదిలీ అవుతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో నేరాలు రెట్టింపుస్థాయిలో నమోదు అవుతున్నాయి. ఒకవైపు ప్రయోజనాలు చేకూర్చుతున్న యాప్‌లు, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ల కారణంగా వినియోగదారులు నిండామునుగుతున్నారు. 

వివిధ రకాలుగా మోసం 
వస్తువుల క్రయ, విక్రయాలు, లాటరీలు, తక్కువవడ్డీకి రుణాలు, వివిధరకాల ఆన్‌లైన్‌ గేమ్స్‌ పేరుతో మోసగాళ్లు అమాయక ప్రజలను ఆకర్షణీయమైన ప్రకటనతో ప్రలోభపెట్టి లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. వాహనాలు, వస్తువులను అతితక్కువ ధరలకు విక్రయిస్తామని  ఫొటోలు పెట్టి ఆకర్షిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 22 సైబర్‌ కేసులు నమోదవగా టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు 19 కేసులను bó దించారు. ఆన్‌లైన్‌ మోసాలను కట్టడి చేసేందుకు కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలో సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. 

ఇలాంటి జాగ్రత్త 
పిల్లలకు డెబిట్‌/క్రెడిట్‌కార్డుల వివరాలను చిన్నపిల్లలకు తెలుపవద్దు.
డబ్బులతో కూడుకున్న ఆన్‌లైన్‌ గేమ్స్‌ పిల్లలను ఆడనివ్వకుండా చూసుకోవాలి.
ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకోకుండా   గూగుల్‌పే, ఫోన్‌పే ఇతరత్రా పద్ధతుల్లో డబ్బు పంపొద్దు.
ఆన్‌లైన్‌లో చూసి వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసే క్రమంలో వాహనాలను, వాటి ధ్రువపత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించి కొనుగోలు చేయాలి.
డెబిట్‌కార్డు/క్రెడిట్‌కార్డు వివరాలు ఎవరికి ఫోన్‌ ద్వారా తెలుపవద్దు.
ఫోన్‌ద్వారా లావాదేవీలు నిర్వహించేప్పుడు అప్రమత్తంగా ఉండాలి, వివరాలు గోప్యంగా ఉంచాలి
వివిధరకాల వెబ్‌సైట్లను చూసినప్పుడు, గేమ్స్‌ ఆడుతున్నప్పుడు మధ్యలో వచ్చే లింక్స్‌ క్లిక్‌ చేయకుండా ఉంటే మంచిది.
ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ చేసేప్పుడు అనుమానిత ఫోన్‌కాల్‌లకు స్పందించవద్దు.
పరిచయం లేని వ్యక్తులతో లావాదేవీలు వద్దు.
వస్తువులు కొనుగోలు చేసేప్పుడు ముందుగానే డబ్బు పంపకుండా ఉంటే మంచిది.
అకౌంట్లకు నగదు జమ అవుతుంది అనే వచ్చే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
అనుమానిత లింక్‌లు ఓపెన్‌ చెయ్యొద్దు. గోప్యంగా ఉండాల్సిన వివరాలు వెల్లడించవద్దు.
దీంతోపాటు పలు విషయాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బు వృథాకాకుండా ఉంటాయి.

పోలీసులకు సమాచారమివ్వాలి
ఆన్‌లైన్‌ మోసాల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారమందించాలి. మోసగాళ్లు సూచించిన విధంగా డబ్బు చెల్లిస్తే నష్టపోకతప్పదు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఫిర్యాదు చేస్తే ఫలితం ఉండదు. కమిషనరేట్‌ కేంద్రంలో సైబర్‌ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అందుబాటులో ఉంది. దీని ద్వారా అనేక సైబర్‌నేరాలు ఛేదిస్తున్నాం.–వీబీ కమలాసన్‌రెడ్డి, కరీంనగర్‌ సీపీ

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా