కలకలం రేపుతున్న సిద్దార్థ హత్య ఘటన

2 Feb, 2021 11:45 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : బెంగళూరులో హత్యకు గురైన సిద్ధార్థ ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. రాపూరు-గుండవోలు అటవీ ప్రాంతంలో సిద్ధార్థ మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లు సమాచారం. ఆస్తుల పంపకాలు ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా  అనుమానిస్తున్నారు. ఈ నెల 19న బెంగళూరులోని అమృతహళ్లి  పోలీస్ స్టేషన్లో  సిద్ధార్థ కనిపించడం లేదంటూ  ఆయన కుటుంబ సభ్యులు  ఫిర్యాదు చేశారు. సిద్ధార్థ.. కర్నాటక  ఓ మాజీ సీఎం బంధువు కూడా అవడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. సిద్ధార్థ ఫోన్ కూడా స్విచాఫ్ అయి ఉండటంతో కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. ఈ విచారణలో వాస్తవాలు బయటకు వచ్చాయి. కొందరు వ్యక్తులు సిద్ధార్థను కిడ్నాప్ చేసి హత్య చేశారని నిర్ధారించారు. వారిపై కేసు నమోదు చేశారు. చదవండి: తల్లీ, కుమార్తెతో సహజీవనం.. ఆపై హత్య


నిందితుల్లో ఒకరైన వినోద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి  రిమాండ్‌కు తరలించారు. అయితే సిద్ధార్థను కిడ్నాప్ చేసిన తరువాత  అతని మృతదేహాన్ని నెల్లూరు జిల్లా రాపూరు-పెంచలకోన సమీపంలోని గు౦డవల్లి అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టినట్లు నిందితుడు వినోద్ చెప్పి నట్లు సమాచారం. ఇవ్వాళ కోర్టు అనుమతితో  నిందితు డు వినోద్ ను నెల్లూరు జిల్లా గుండవోలు అటవీ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి కే కొందరు కర్నాటక పోలీసులు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఎక్కడో బెంగుళూరులో హత్య చేసిన వ్యక్తిని వందల కిలోమీటర్లు దాటి నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి పూడ్చి పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వాటిపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈరోజు నిందితుడు వినోద్‌ను తీసుకొచ్చిన పోలీసులు మృతదేహాన్ని  వైద్యుల సమక్షంలో బయటకు తీయబోతున్నారు.

మరిన్ని వార్తలు