Hyderabad: బ్యాంక్ ఆఫ్‌ బరోడా చోరీ కేసు.. పోలీసులకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన ప్రవీణ్‌

16 May, 2022 14:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్‌ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్‌ క్యాషియర్ ప్రవీణ్ సోమవారం అనూహ్యంగా కోర్టులో లొంగిపోయాడు. అయితే, వారం రోజుల క్రితం రూ.22 లక్షలతో ఉడాయించిన ప్రవీణ్.. పోలీసులకు దొరకకుండా నేరుగా కోర్టులో లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది.

అనంతరం హయత్‌ నగర్‌ కోర్టు.. ప్రవీణ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో పోలీసులు ప్రవీణ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నెల 30 వరకు ప్రవీణ్‌ రిమాండ్‌లో ఉండనున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా ప్రవీణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బ్యాంక్ ఆఫ్ బరోడాలో చాలా అవకతవకలు ఉన్నాయి. నేను ఎలాంటి మోసానికి పాల్పడలేదు. బ్యాంక్‌లో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకునేందుకే నన్ను దోషిగా చిత్రీకరిస్తున్నారు. అతి త్వరలో బయటకు వచ్చి బ్యాంక్ మోసాలను బయట పెడతాను. అంతర్జాతీయ స్థాయిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుంభకోణలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తి సాక్షాలతో నిరూపిస్తాను. బ్యాంక్‌లో లకర్స్‌కి పెట్టాల్సిన కెమెరాను కిందకు పెట్టారు’’ అని తెలిపాడు.

జరిగింది ఇది.. 
నగరంలోని వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 22.53 లక్షల నగదు తీసుకుని క్యాషియర్ ప్రవీణ్ కుమార్ పరారయ్యాడు. డబ్బులు తానే తీసుకెళ్లానని, క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి నష్టపోయానని.. మళ్లీ బెట్టింగ్‌లో పెడతానని అవి వస్తే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ బ్యాంక్ మేనేజర్‌కు ప్రవీణ్ మొదట మెసేజ్ చేశారు. అనంతరం మాట మార్చి.. బ్యాంక్ నుంచి డబ్బులు తాను తీసుకెళ్లలేదంటూ సెల్ఫీ వీడియోను బయటకు వదిలాడు. ఆ వీడియోలో బ్యాంక్ మేనేజర్ వినయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని, అనవసరంగా తనను ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపించాడు.

ఇది కూడా చదవండి:  హైటెక్‌ దొంగ.. చోరీ చేసిన కార్లను..

మరిన్ని వార్తలు