10 ఏళ్ల వయసులో జైలుకు.. 53 ఏళ్లప్పుడు నిర్దోషిగా విడుదల

13 Oct, 2022 10:13 IST|Sakshi

పాట్నా:  హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వ‍్యక్తి 43 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. 10 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లి 53 ఏళ్ల వయసులో నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ సంఘటన బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో జరిగింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేస్తూ బాక్సర్‌ జిల్లా జువైనల్ జస్టిస్‌ బోర్డు కొట్టి వేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఇంతకి ఏం జరిగిందంటే?

జిల్లాలోని మురార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి చౌగాయి గ్రామంలో ఓ దుకాణదారుడిపై 1979, సెప్టెంబర్‌లో హత్యాయత్నం జరిగింది. పలువురు దుండగులు తనను హత్య చేసేందుకు దాడి చేశారని పోలీసుకు ఫిర్యాదు చేశాడు. అందులో మున్నా సింగ్‌ అనే 10 ఏళ్ల బాలుడిపైనా ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత బాలుడిని సెక్షన్‌ 148, 307ల కింద అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ పెండింగ్‌లో పడిపోయింది. 2012 నుంచి ఈ కేసును బక్సర్‌ జిల్లా జువైనల్‌ జస్టిస్‌ బోర్డు విచారిస్తోంది. 

జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్‌ రాజేశ్‌ సింగ్ ఈ కేసులో సాక్షులను ప్రవేశపెట్టాలని పలుమార్లు ఫిర్యాదుదారుకు నోటిసులు పంపించారు. అయితే, ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో మున్నా సింగ్‌ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పింది జిల్లా కోర్టు. ప్రస్తుతం మున్నా సింగ్‌ వయసు 53 ఏళ్లు. తనను నిర్దోషిగా వదిలిపెట్టినందుకు సంతోషం వ్యక్తం చేసిన సింగ్‌.. దశాబ్దాల పాటు కేసును పెండింగ్‌లో పెట్టటంపై అసహనం వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు