‘ఇళ్లల్లోకి వెళ్లండి, రోడ్లపై కనిపిస్తే కాల్చిపడేస్తాం’

9 May, 2021 13:07 IST|Sakshi

భోపాల్‌: ఆకతాయిలు వీరంగం సృష్టించారు. పట్టపగలే బైకులపై తిరుగుతూ తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ‘రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. రోడ్లమీద కనిపిస్తే కాల్చిపడేస్తాం’ అంటూ కొందరు ఆకతాయిలు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన మొరెనా జిల్లా బంఖండి ప్రాంతం కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గుర్తు తెలియని 25మంది దుండగులు మాస్క్‌ ధరించి గన్స్‌తో వీరంగం సృష్టించారు. బైక్‌పై డ్రైవ్‌ చేసుకుంటూ 100 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. తుపాకీ గుళ్ల శబ్దంతో ఉలిక్కిపడ్డ ప్రజలు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఇళ్లు, బస్సులు ద్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు.

కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న అడిషనల్‌ ఎస్పీ రాయ్‌ సింగ్‌ నార్వారియా పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు పాల్పడ్డ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప‍్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. అయితే, పోలీసుల వెర్షన్‌ ఇలా ఉంటే స్థానికుల వెర్షన్‌ మరోలా ఉంది. ఈ కాల్పులు లాక్‌డౌన్‌ నిబంధనల్ని పాటించనందుకు కాదు. ఓ యువతి ఫేస్‌ బుక్‌లో  పెట్టిన పోస్ట్‌ వల్ల రెండు సామాజిక వర్గాల మధ్య అగ‍్గిరాజేసిందని చెప్తున్నారు.

ఓ వర్గం మరో వర్గంవారిని టార్గెట్‌ చేస్తూ కాల్పులకు దిగిందని అంటున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ఇదే అంటూ స్థానికులు ఓ వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలాఉండగా.. మధ‍్యప్రదేశ్‌లో కరోనావైరస్‌ విజృంభిస్తుండడంతో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల్ని కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ ఒక్కటే శరణ్యం.. అందుకే రాష్ట్రంలో మే15 వరకు జనతాకర్ఫ్యూ పేరుతో లాక్‌డౌన్‌ విధిస‍్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు