అన్నకు రాఖీ కట్టి వెళ్తూ.. అనంత లోకాలకు!

4 Aug, 2020 07:26 IST|Sakshi

బస్సును ఢీకొన్న బైక్‌  ఇద్దరి దుర్మరణం 

లక్ష్మీపల్లి స్టేజీ వద్ద ఘటన 

చిన్నంబావి/వీపనగండ్ల (వనపర్తి): ‘అన్నాచెల్లెళ్ల అనుంబంధానికి ప్రతీక రక్షాబంధన్‌.. అన్నయ్యా.. నువ్వే నాకు రక్ష..’ అంటూ ఆ చెల్లెలు రాఖీ కట్టింది. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెతో పాటు వరుసకు సోదరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిస్టేజీ సమీపంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వీపనగండ్ల మండలం తూంకుంటకు చెందిన నందిని (14), వరుసకు అన్నయ్య అయిన దామోదర్‌ (16) తో కలిసి సోమవారం ఉదయం రాఖీ పౌర్ణమి సందర్భంగా పెద్దదగడకు బైక్‌పై వెళ్లారు.

తమ బంధువు శంకరయ్య ఇంటికి వచ్చి వరుసకు ఆయన కుమారులు సోదరులు కావడంతో రాఖీ కట్టింది. సాయంత్రం తిరిగి శంకరయ్య కూతురు లక్ష్మితో కలిసి ముగ్గురూ తిరుగు ప్రయాణమయ్యారు. లక్ష్మీపల్లి స్టేజీ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో పెబ్బేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, తూంకుంటకు చెందిన సుధాకర్, కురుమయ్య సొంత అన్నదమ్ములు. సుధాకర్‌ కూతురు నందిని, కురుమయ్య ఒక్కగానొక్క కుమారుడు దామోదర్‌ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటనతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

స్కూటీ, కారు ఢీకొన్న ఘటనలో యువతి.. 
దేవరకద్ర: స్కూటీని కారు ఢీకొన్న ఘటనలో ఓ యువతి మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. నారాయణపేటకి చెందిన వడ్ల నాగరాణి(21), జాజాపూర్‌కు చెందిన సిద్దప్ప సోమవారం నారాయణపేట నుంచి మహబూబ్‌నగర్‌కు స్కూటీపై బయల్దేరారు. చౌదర్‌పల్లి సమీపంలో అంతర్రాష్ట రహదారిపై మహబూబ్‌నగర్‌ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు స్కూటీని ఢీ కొట్టింది. దీంతో నాగరాణి అక్కడికక్కడే మృతి చెందగా సిద్దప్ప తీవ్రంగా గాయపడ్డాడు. 

మరిన్ని వార్తలు