కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

4 Aug, 2020 07:33 IST|Sakshi

కొత్తగూడెం: భద్రాచలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్‌ నేత సున్నం రాజయ్య కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భద్రాచలం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1999, 2004, 2014లలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత)

కోవిడ్ నిబంధనల మేరకు ఆయన స్వగ్రామం సున్నంవారి గూడెంలో మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు జరగనున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన ఆయన నిరాడంబరమైన జీవితం గడిపారు. అసెంబ్లీకి ఆటోలో, బస్సుల్లో వెళ్లారు. భాగ్యనగర వీధుల్లో అన్న క్యాంటీన్ల వద్ద భోజనం చేసి కడుపు నింపుకునేవారు.

ఆయన విలువలకు మారు పేరు: విజయసాయిరెడ్డి
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సున్నం రాజయ్య మృతికి సంతాపం తెలియజేశారు. 'సీపీఐ నేత, విలువలకు మారు పేరు అయిన సున్నం రాజయ్య గారి అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. గిరిపుత్రుల హక్కుల కోసం ఆయన ఎంతగానో కృషి చేసారు. అయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నాను. ఆయన కుటుంబ సభ్యలకు నా ప్రగాడ సానుభూతి' అంటూ ట్వీట్‌ చేశారు. 

ఆదర్శ నాయకుడు: మంత్రి హరీశ్‌రావు
‘నేను అత్యంత గౌరవించే, సున్నం రాజయ్య గారి మరణం తీవ్రదుఃఖాన్ని కలిగించింది. పేదప్రజలు,ఆదివాసీలు, గిరిజనులు,దళితుల గొంతుగా జీవితాంతం వారి సమస్యల పరిష్కారం కోసమే బతికిన అసామాన్యుడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, రాజకీయాల పట్ల జనసామాన్యంలో విశ్వాసం కలిగించిన ఆదర్శ నాయకుడు’  అంటూ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు