Visakhapatnam: రమేష్‌తో సన్నిహిత సంబంధం.. చిన్నపిల్లలను కిడ్నాప్‌ చేస్తూ..

9 Dec, 2021 20:02 IST|Sakshi

ఆరు బయట ఆడుకునే పిల్లలు.. ఆసుపత్రి వద్ద కని పెంచలేని తల్లులు.. నిద్రపోతున్న చిన్నారులు.. పిల్లలు లేని తల్లిదండ్రులు.. ఇది ఓ ముఠా టార్గెట్. చిన్నారులను ఎత్తుకుపోవడం మరొకరికి విక్రయించడం అదికూడా లక్షల్లో.. చాలా కాలంగా సాగుతున్న ఈ అక్రమ వ్యవహారానికి విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. అరకులో జరిగిన ఓ ఉదంతంతో ఈ మొత్తం వ్యవహారానికి బ్రేక్ పడింది.

సాక్షి, విశాఖపట్నం: పెందుర్తి ప్రాంతానికి చెందిన నీలాపు రమణి విక్టోరియా ఆసుపత్రి లో సెక్యూర్టీ గార్డుగా పని చేస్తున్నారు. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన పొలమర శెట్టి రమేష్‌తో సన్నిహిత సంబంధం ఏర్పడింది. వీరిరువురు కలిసి ఆస్పత్రి వద్ద పిల్లలు కలగని తల్లులకు పిల్లలను ఇస్తే డబ్బులు సంపాదించవచ్చని భావించారు. ఆ క్రమంలో ఈ ఏడాది జూన్ నెలలో క్రాంతి అనే వ్యక్తికి ఓ చిన్నారిని అప్పగించారు. దీనికి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ వ్యవహారం లాభదాయకంగా మారడంతో అరకులో అమ్మ, నాన్న పక్కన అర్ధరాత్రి నిద్రపోతున్న ఓ ఆరు నెలల బాబును కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ బాబును మరొకరికి విక్రయించాలని పథకం వేశారు. కానీ నిందితులు బాబును కిడ్నాప్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఓ మొబైల్‌ని కూడా ఎత్తుకుపోయారు.

చదవండి: (నాలుగేళ్ల తర్వాత గల్ఫ్‌ నుంచి ఇంటికి.. 24 గంటలు గడవకముందే..)

తమ పక్కన నిద్రిస్తున్న బాబు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరకు పోలీసులు విచారణలో భాగంగా మొబైల్ ఫోన్ కూడా పోయిందని గుర్తించి టవర్ లొకేషన్‌ ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితుల్లో పెందుర్తికి చెందిన నీలపు రమణి సూత్రధారిగా తేలింది. ఆమె తన సన్నిహితుడు పొలమరశేట్టు రమేష్‌తో తెలిసి ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. ఈ వ్యవహారంలో మొత్తం 12 మందికి భాగస్వామ్యం ఉన్నట్టు విశాఖ పోలీసుల గుర్తించారు. నీలపు రమణి, పొలమరశెట్టి రమేష్‌లను అరెస్ట్‌ చేసి.. నిందితుల నుంచి నాలుగు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇటీవల కాలంలో అరకులోని బాబుతో పాటు మరో నలుగురిని విక్రయించినట్లు తేలడంతో ఆ చిన్నారులను కూడా తల్లిదండ్రులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు