DGCA: Scheduled International Flights To Remain Suspended Till January 31st 2022 - Sakshi
Sakshi News home page

International Flights Suspended: అలెర్ట్! అంతర్జాతీయ విమానాలు రద్దు.. డీజీసీఏ కొత్త ఆదేశాలు

Published Thu, Dec 9 2021 7:33 PM

DGCA Suspends International Flights Till 2022 January 31 - Sakshi

అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ విషయంలో మళ్లీ మెళిక పడింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాందోళనల నేపథ్యంలో డైరెక్టర్‌ జనరల్ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ కొత​ మార్గదర్శకాలను జారీ చేసింది.

అప్పటి నుంచి ఆంక్షలే
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా 2020 మార్చి 29న భారత ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. ఆ తర్వాత 2020 మే నుంచి వందే భారత్‌ మిషన్‌ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడిపించారు. ఆ తర్వాత ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం కింద 32 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. దీనికి తగ్గట్టుగా పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి.

పునరుద్ధరిస్తాం
కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్‌ ఏవియేషన్‌ శాఖ అంతర్జాతీయ విమానలు అన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది.

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌
డీజీసీఏ నుంచి ప్రకటన వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్‌ వేరియంట్‌ గురించి సమాచారం దక్షిణాఫ్రికా బయటి ప్రపంచానికి తెలిపింది. ఆ వెంటనే పరిమితంగా నడుస్తున్న విమాన సర్వీసులు, ప్రయాణికుల విషయంలో ఆంక్షలు తెరపైకి వచ్చాయి. దీంతో విమానాల పునరుద్ధరణ నిర్ణయం వాయిదా వేస్తున్నట్టు డిసెంబరు 1న డీజీసీఏ ప్రకటించింది.

జనవరి 31 వరకు
గత పది రోజుల వ్యవధిలో ఇండియాతో సహా అనేక దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ 2021 డిసెంబరు 9న ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ నడిపింంచాలనే నిర్ణయాన్ని 2022 జనవరి 31 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 

వీటికి గ్రీన్‌సిగ్నల్‌
ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం ఉన్న 32 దేశాల నుంచి పరిమిత సంఖ్యలో ప్రస్తుతం నడుస్తున్నట్టుగానే కొన్ని విమాన సర్వీసులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 32 దేశాల జాబితాలో యూకే, యూఎస్‌, కెన్యా, యూఏఈ, భూటాన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు ఉన్నాయి. అదే విధంగా కార్గో విమాన సర్వీసులు కూడా యథావిధిగా ఉంటాయి.

చదవండి: హైదరాబాద్‌ వచ్చే ఎన్నారై, విదేశీయులకు గుడ్‌న్యూస్‌ !

Advertisement
Advertisement