చపాతి గొడవ.. కస్టమర్‌ ప్రాణం తీసిన కుక్‌

3 Oct, 2021 19:55 IST|Sakshi

సంభాల్: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చేటు చేసుకుంది. దాబాలో పనిచేసే ఓ కుక్‌.. కస్టమర్‌పై దాడి చేసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖెంపాల్ అనే ట్రాన్స్‌పోర్టర్‌ సంభాల్‌లోని తన షాప్‌కు సమీపంలో ఉండే ఓ దాబాలో భోజనం అర్డర్‌ చేశాడు. అర్డర్‌ చేసిన భోజనాన్ని దాబా బేరర్‌ ఖెంపాల్‌కు ఇచ్చాడు. అయితే భోజనం ఎలా ఉందో తెలుసుకోవాలని ఖెంపాల్‌ ఫుడ్‌ తెరిచి చూశాడు. అందులో చపాతిలు సగం కాలినట్లు మాడిపోయి కనించాయి. దీంతో ఖెంపాల్‌ వాటిని చేసిన కుక్‌ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ఖెంపాల్‌ అక్కడి నుంచి తన షాప్‌కు వెళ్లాడు.

అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న అనిల్‌.. ఖెంపాల్‌ షాప్‌ వద్దకు వెళ్లి అతనిపై దారుణంగా దాడి చేశాడు. దీంతో ఖెంపాల్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. స్థానిక ఎస్పీ చక్రేశ్‌ మిశ్రా మాట్లాడుతూ.. రాత్రి సమయంలో కుక్‌ అనిల్‌.. ఖెంపాల్‌ షాప్‌ వద్దకు వెళ్లి కర్రతో దాడి చేయడంతో అతను మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనను సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా నిర్ధారించామని పేర్కొన్నారు. నిందితుడు అనిల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు