మైనర్‌పై అఘాయిత్యం.. ఇద్దరిని బైక్‌తో సహా సజీవ దహనం చేసిన గ్రామస్తులు

9 Jun, 2022 14:38 IST|Sakshi

తెలిసిన వ్యక్తే కదా! అని నమ్మి కూతురిని కూడా పంపించారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ కీచకుడు.. మరోకరితో కలిసి దాష్టికానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి ఊరు ఊరంతా రగిలిపోయింది. నిందితులకు ‘చావే సరైన శిక్ష’ అనుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఇంటి దగ్గర దిగబెడతాం అంటూ మైనర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని.. సజీవ దహనం చేశారు గ్రామస్తులు. 

ఈ షాకింగ్‌ ఘటన జార్ఖండ్‌, గుమ్లాలో జరిగింది. బుధవారం బంధువుల ఇంటికి వెళ్లిన ఓ కుటుంబం.. సాయంత్రం  స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాప్‌లో ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఆ కుటుంబం పక్క ఊరిలో ఉండే సునీల్‌ ఉన్‌రావ్‌ అనే వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చాడు. అతని కూడా బైక్‌ మీద స్నేహితుడు కూడా ఉన్నాడు. బాగా ఆలస్యం అయ్యేట్లు ఉందని, కనీసం అమ్మాయినైనా తమతో పంపించమని అడిగాడు. బాగా దగ్గరి వాడే కదా నమ్మి  కూతురిని అని బైక్‌ మీద పంపించారు ఆ తల్లిదండ్రులు. 

అయితే ఆ తల్లిదండ్రులు ఇంటికి చేరినా.. ఎంతసేపటికి కూతురు మాత్రం రాలేదు. దీంతో సునీల్‌కు ఫోన్‌ చేశారు. అతను ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానం వచ్చి గాలించారు. ఈలోపు పక్క ఊరి శివారులో ఒక అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉందన్న సమాచారం వీళ్లకు అందింది. వెళ్లి చూస్తే.. అది వాళ్ల కూతురే. తనపై అఘాయిత్యం జరిగిందని చెప్పింది బాధితురాలు. విషయం తెలిసి బాధితురాలి గ్రామస్తులు చిర్రెత్తి పోయారు. పొరుగూరికి వెళ్లి మరీ నిందితులను దొరకబుచ్చుకుని చితకబాదారు. 

తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరినీ తమ ఊరికి లాక్కొచ్చారు. వాళ్ల బైక్‌తో సహా పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. ఈ ఘటనలో సునీల్‌ మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కేసు బుక్‌ చేసుకున్న పోలీసులు.. ఆరుగురిపై హత్య కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు