పక్కాగా రెక్కీ.. మరో 10 మందిని చంపేందుకు స్కెచ్‌

24 Jun, 2021 08:15 IST|Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: కరుడుగట్టిన నేరస్తులు సినీ ఫక్కీలో చేస్తున్న హత్యల పరంపరకు పోలీసులు బ్రేక్‌ వేశారు. హంతక ముఠా పోలీసులకు పట్టుపడకపోయి ఉంటే రానున్న నెల రోజుల వ్యవధిలో మరో పది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.! గత ఏడాది అక్టోబరు నుంచి వరుస హత్యలు, దోపిడీలకు ఈ ముఠా పాల్పడుతోంది. ఇటీవల ఏటీఎం చోరీ కేసులో పోలీసులకు పట్టుపడటంతో ముఠా అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.  

క్రూరంగా హత్యలు..  
పెనమలూరు మండలం పోరంకి, తాడిగడపకి చెందిన ఫణి, చక్రి, గోపి, చంటి, కుమార్‌ అనే ఐదుగురు యువకులు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా యూ ట్యూబ్‌లో నేరాలకు సంబంధించిన వీడియోలు చూసి నేర బాట పట్టారు. పగటి పూట చిన్నా చితక పనులు చేస్తూ రెక్కీ నిర్వహించి, రాత్రి పూట నేరాలకు పాల్పడే వారు. ఇప్పటి వరకు వీరు మొత్తం ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు. కంచికచర్లలో వృద్ధ దంపతులతోపాటు పెనమలూరు మండలంలో నలుగురిని అత్యంత క్రూరంగా హత్యలు చేసి మృతుల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలో మూడు స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. తెనాలిలో రెండు ఏటీఎంల్లో, మంగళగిరిలో ఒక ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు.   

మరో పది మందిపై రెక్కీ.. తప్పిన ముప్పు 
నిందితులను పోలీసు అరెస్టు చేయడంలో మరో నెల రోజులు ఆలస్యమై ఉంటే.. వీరు మరో పది మంది ప్రాణాలు తీసేవారు. హంతక ముఠా సభ్యులు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో పది హత్యలు చేసేందుకు పథకం రచించారు. ఇందుకు ఆయా ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారు. ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధుల ఇళ్లను ఎంచుకున్నారు. మరో నెల రోజుల వ్యవధిలో పథకాన్ని అమలు చేసి బంగారం చోరీ చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈలోపు పెనమలూరు పోలీసులకు పట్టుపడటంతో హత్యల పరంపరకు బ్రేక్‌ పడింది. విచారణలో నిందితులు సినీ ఫక్కీలో ఈ హత్యలకు వేసిన పథకాలను పోలీసులకు వెల్లడించారు.   

నేడు కోర్టులో హాజరు..!   
తేలికగా డబ్బు సంపాదించాలన్న అత్యాశకుపోయి అడ్డదారులు తొక్కిన హంతక ముఠా సభ్యులను పెనమలూరు పోలీసులు నేడు కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం. ఆరు హత్యలతోపాటు దోపిడీలతో సహా 19 నేరాల్లో నిందితుల హస్తం ఉంది. ఇప్పటికే   నిందితులను విచారించిన పోలీసులు పూర్తి వివరాలు రాబట్టారు. అలాగే నిందితులు పలు చోట్ల కుదువ పెట్టిన చోరీ చేసిన నగలను సైతం పోలీసులు రికవరీ చేశారు. మొత్తమ్మీద ఈ హత్యలు, దోపిడీలపై పెనుమలూరు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేయనున్నారు.
చదవండి: ఆత్మహత్య: నడుముకు రాయి కట్టుకుని బావిలో దూకిన మహిళ

మరిన్ని వార్తలు