నేడు అందరి దృష్టి కోర్టుల వైపే  | Sakshi
Sakshi News home page

నేడు అందరి దృష్టి కోర్టుల వైపే 

Published Mon, Oct 9 2023 4:10 AM

Chandrababu Quash Petition hearing in Supreme Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ /సాక్షి అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగనుంది. జస్టిస్‌ అనిరుద్దాబోస్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. ఆరవ నంబర్‌ కోర్టులో ఐటమ్‌ 59గా ఈ పిటిషన్‌ను జాబితాలో చేర్చారు. గత విచారణ సందర్భంగా హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిన విషయం విధితమే.

ఇదిలా ఉండగా, ఇదే కేసులో చంద్రబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుకు రెండ్రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. కానీ చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేయడంతో పాటు కస్టడీలో విచారణకు ఏమాత్రం సహకరించలేదని సీఐడీ న్యాయస్థానానికి తెలిపింది. దాంతో పాటు ఈ కేసు దర్యాప్తులో తాజాగా కనుగొన్న కీలక ఆధారాలపై ఆయన్ను సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానానికి నివేదించింది.

ప్రధానంగా షెల్‌ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాలో చేరిన అక్రమ నిధుల వ్యవహారంపై ప్రశ్నించాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అందుకే చంద్రబాబును మరో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని కోరింది. మరో వైపు చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఆయన్ను కస్టడీకి ఇవ్వొద్దని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై సీఐడీ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాజకీయంగా బలవంతుడైన చంద్రబాబు ఇప్పటికే ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని ఉదాహరణలతో సహా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్‌ ఇస్తే సాక్షులను మరింతగా బెదిరించడంతో పాటు కేసు దర్యాప్తును ప్రభావం చేస్తారని వాదనలు వినిపించారు. కాబట్టి చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్లపై వరుసగా మూడు రోజుల పాటు వాదనలు విన్న న్యాయస్థానం రిజర్వు చేసిన తీర్పును నేడు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.   

హైకోర్టులో బెయిల్‌ పిటీషన్లపై నేడు తీర్పులు 
మరో వైపు హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన మూడు బెయిల్‌ పిటీషన్లపై సోమవారం తీర్పులు వెలువడనున్నాయి. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిల్‌ కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటీషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కే.సురేష్ రెడ్డి తీర్పులను రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పిటీషన్లపై న్యాయమూర్తి సోమవారం తీర్పులను వెలువరించనున్నారు.  

Advertisement
Advertisement