Hyderabad: నకిలీ ఆర్సీల తయారీ ముఠా గుట్టురట్టు

1 Dec, 2021 08:24 IST|Sakshi
పట్టుబడిన నిందితులు

భద్రాద్రి కొత్తగూడెం, అత్తాపూర్‌ ఆర్టీఏ ఆఫీసుల్లో ఆర్సీల చోరీ

వీటిని వాహన బ్రోకర్లకు విక్రయించిన ఆర్టీఏ ఏజెంట్లు

నకిలీవి సృష్టించి వాహనదారులకు అమ్మిన మధ్యవర్తులు

సైబరాబాద్‌ ఎస్‌ఓటీకి చిక్కిన ఏడుగురు నిందితులు

1,200 నకిలీ ఆర్సీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ ఆర్సీలు, ఆధార్‌ కార్డులను సృష్టించి సొమ్ము చేసుకోవడంతో పాటు కొత్త ఆర్సీ జారీతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారు నకిలీ ఆర్సీ ముఠాను సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఓటీ డీసీపీ సందీప్‌తో కలిసి సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మంగళవారం వివరాలు వెల్లడించారు.

నగరంలోని యూసుఫ్‌గూడ వాసి షేక్‌ జాంగీర్‌ బాషా,  కిషన్‌బాగ్‌కు చెందిన సయ్యద్‌ హుస్సేన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి సంపత్‌.. వీరు ముగ్గురు అత్తాపూర్, భద్రాద్రి కొత్తగూడెం రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టీఏ) కార్యాలయాల్లో ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాలోని లొసుగులను ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకునేందుకు పక్కా ప్లాన్‌ వేశారు. ప్రధాన నిందితుడు శంషాబాద్‌ రాళ్లగూడకు చెందిన చామన సతీష్, కాటేదాన్‌కు చెందిన డీటీపీ ఆపరేటర్‌ ఎం గణేష్, వాహన మధ్యవర్తులు అల్వాల్‌కు చెందిన కలిగిడి చంద్రశేఖర్, మదీనాగూడ వాసి  సీహెచ్‌ రమేష్‌లు ముఠాగా ఏర్పడ్డారు. 

ఆర్టీఏలో వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించే సమయంలో ఆర్సీ కార్డు చేతికివ్వరు. వాహనదారు సూచించిన ఇంటి అడ్రస్‌కు కొరియర్‌ ద్వారా వస్తుంది. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నా లేదా వాహనదారు ఇల్లు మారినా, మరే కారణంతోనైనా ఆర్సీ తీసుకోని పక్షంలో అది తిరిగి ఆర్టీఏ కార్యాలయానికి వస్తుంది. ఇలా వచ్చిన ఆర్సీలను జాంగీర్‌ బాషా, సయ్యద్‌ హుస్సేన్, సంపత్‌లు దొంగిలించి.. ఒక్కో ఆర్సీని రూ.900 చొప్పున సతీష్, చంద్రశేఖర్, రమేష్‌లకు విక్రయిస్తారు. డేటా ఆపరేటర్‌ గణేష్‌ ఆయా ఒరిజినల్‌ ఆర్సీ కార్డులపై ఉన్న యజమాని వివరాలను నెయిల్‌ పాలిష్‌ (డాజ్లర్‌)తో తొలగించి నకిలీ ఆర్సీలను సృష్టిస్తాడు.

ఆయా బ్రోకర్ల నుంచి వాహనాలను కొనుగోలు చేసిన వాహనాదారులు రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ కార్యాలయానికి సందర్శించినప్పుడు కొత్త ఆర్సీలు జారీ కావు. ఎందుకంటే ఒరిజినల్‌ ఆర్సీని అధికారులు స్వాధీనం చేసుకొని ఆధార్‌ కార్డును ధ్రువీకరించుకున్న తర్వాతే కొత్త ఆర్సీ జార్సీ చేస్తారు గనక! దీంతో ఆయా వాహన బ్రోకర్లు అంతకుముందే సృష్టించిన నకిలీ ఆర్సీ, ఆధార్‌ కార్డులను వాహనాదారులకు అందిస్తారు. వీటిని ఆర్టీఏ అధికారులకు సమర్పించి.. వాహనదారులు కొత్త ఆర్సీలను తీసుకుంటారు. 

ఒడిశా వాహనాలకు నకిలీ ఆర్సీ కాపీలు సృష్టిస్తున్నారని సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసుల దృష్టికి రావటంతో రంగంలోకి దిగారు. ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.10 వేల నగదుతో పాటు 1,200 నకిలీ ఆర్సీలు, 29 రబ్బర్‌ స్టాంపులు, 75 ఆధార్‌ కార్డులు, రెండు ల్యాప్‌టాప్‌లు, సీపీయూ లు, ప్రింటర్లు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

ప్రభుత్వ ఆదాయానికి గండి
గత కొన్ని నెలలుగా ఈ ముఠా నకిలీ ఆర్సీ బాగోతాన్ని నడుపుతోంది. ఒక్కో ఆర్సీ జారీ ద్వారా ప్రభుత్వానికి వచ్చే రూ.1,000 నుంచి 1,200 ఆదాయానికి గండిపడింది. సుమారు వెయ్యి వా హనాలకు నకిలీ ఆర్సీలను సృష్టించారు. ఆయా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. వాహనాలను దొంగతనం చేసే నేరస్తులకు కూడా నకిలీ ఆర్సీలను ఇవ్వాలని ఈ మోసగాళ్లు భావించినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

మరిన్ని వార్తలు