తండ్రిని హతమార్చిన కూతురు 

23 Sep, 2022 01:46 IST|Sakshi

భర్త, మేనమామతో కలిసి కిరోసిన్‌ పోసి సజీవ దహనం  

సిద్దిపేట జిల్లా ఇందూప్రియాల్‌లో దారుణం 

దౌల్తాబాద్‌(దుబ్బాక): సొంత కూతురే భర్త, మేనమామతో కలిసి తండ్రిని హతమార్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండల పరిధిలోని ఇందూప్రియాల్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన హనుమాండ్ల కాడి వెంకటయ్య (42) గతంలో అత్తపై అత్యాచారం చేసిన కేసులో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలై గ్రామానికి వచ్చాడు.

ఆ అత్యాచార విషయమై వెంకటయ్యతో ఆయన భార్య స్వరూప గొడవపడి ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, గతంలోనే కూతురు రజితను అదేగ్రామానికి చెందిన కనకయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. వారితోసైతం వెంకటయ్య రోజూ గొడవ పడుతుండటంతో విసుగు చెందిన కూతురు, అల్లు డు ఆయనను అడ్డు తొలగించుకోవాలని భా వించారు.

వీరికి తోడు తన తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న కక్షపెంచుకున్న బావమరిది నాగసానిపల్లికి చెందిన శ్రీహరి వారికి తోడయ్యాడు. ముగ్గురు కలిసి బుధవారం అర్ధరాత్రి వెంకటయ్యపై విచక్షణారహితంగా దాడి చేశా రు. అనంతరం తీవ్ర గాయాలపాలైన వెంకటయ్యపై కిరోసిన్‌పోసి నిప్పంటించారు. దీంతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటయ్య అన్న ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు