వివాహేతర సంబంధం.... ప్రియుడితో కలిసి సొంత మామను..

13 Sep, 2021 11:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, శాలిగౌరారం(నల్లగొండ): వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలిచాడని ప్రియుడితో కలిసి సొంత మామను కడతేర్చింది ఓ కోడలు. అందుకు సంబంధించిన ఆదివారం బాధిత కుటుంబ బంధువులతోపాటూ ఎస్‌ఐ హరిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన శ్యామల ముత్తయ్య(60)కు భార్య, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముత్తయ్య వృత్తిరీత్యా బాతుల పెంపకం నిర్వహిస్తుంటాడు.

అందులో భాగంగా బాతులను మేపేందుకని శాలిగౌరారం మండలంలోని మాధారంకలాన్‌ గ్రామానికి వారం కిందట కుమారుడు నర్సింహ, కోడలు శైలజతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో మాధారంకలాన్‌ గ్రామ సమీపంలోని చెరువుకట్ట కిందిభాగంలో తాత్కాలిక గుడిసె వేసుకున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌ పట్టణంలో నివాసం ఉంటున్న ముత్తయ్య పెద్దకుమార్తె ఇంటివద్ద ఆదివారం మనుమరాలుకు నూతన పట్టువస్త్రాలంకరణ ఉండడంతో ముత్త య్య కొడుకు నర్సింహ శనివారం కరీంనగర్‌ వెళ్లిపోయాడు. 

వేరొకరితో సఖ్యతగా ఉంటూ..
కోడలు శైలజ తన అన్నకు వరుసకు బావమరిది అయిన నేరేడుచర్లకు చెందిన బాతుల పెంపకందారుడైన మహేశ్‌తో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోంది. ప్రస్తుతం కేతేపల్లి మండలం కాసనగోడులో బాతులను మేపుతున్న మహేశ్‌ శైలజ భర్త కరీంనగర్‌కు వెళ్లిన విషయం తెలుసుకొని శనివారం రాత్రి మాధారంకలాన్‌లోని శైలజ ఉంటున్న గుడిసె వద్దకు వచ్చాడు. అదేసమయంలో బీడీల కోసమని మాధారంకలాన్‌కు వెళ్లి వచ్చేసరికి శైలజ, మహేశ్‌లు ఒంటరిగా గుడిసెలో ఉన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన ముత్తయ్య కోడలు శైలజ, ఆమె ప్రియుడు మహేశ్‌లను తిడుతూ ఈ విషయాన్ని ఆదివారం ఉదయం ప్రజలకు చెబుతానని హెచ్చరించాడు. 

తలదిండు పెట్టి ఊపిరాడకుండా చేసి..
దీంతో విషయం ఎలాగైనా బయటపడుతుందని గమనించిన కోడలు శైలజ, ప్రియుడు మహేశ్‌తో కలిసి ముత్తయ్యపై దాడికి దిగారు. ఈ క్రమంలో కిందపడిపోయిన ముత్తయ్య ముఖంపై తలదిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ముత్తయ్య మృతిచెందాడని నిర్ధారించుకున్న తర్వాతా అక్కడి నుంచి మహేశ్‌ పరారీ అయ్యాడు. కోడలు శైలజ తన పిల్లలతో కలిసి మామ మృతదేహాన్ని గుడిసెలోనే ఉంచి నిద్రించింది. ఆదివారం తెల్లవారుఝామున కరీంనగర్‌లో ఉన్న తన భర్త నర్సింహకు ఫోన్‌చేసి మామ ముత్తయ్య గుండెపోటుతో మృతిచెందాడని తెలిపింది.

దీంతో ఆదివారం సాయంత్రానికి మాధారంకలాన్‌కు చేరుకున్న నర్సింహ తండ్రి శరీరం, ముఖంపై ఉన్న గాయాలతో భార్యపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా.. హత్యకు పాల్పడిన కోడలు శైలజ పోలీసుల అదుపులో ఉంది. పరారీలో ఉన్న మహేశ్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  

చదవండి: Missing Cases: ఒంటరిగా అదృశ్యం.. జంటగా ప్రత్యక్షం

మరిన్ని వార్తలు