అక్రమంగా వీసా ప్రాసెసింగ్‌

13 Aug, 2020 09:37 IST|Sakshi

ఇప్పటికే నిందితుడిపై నాలుగు కేసులు 

జైలుకెళ్లొచ్చినా మారని తీరు 

మళ్లీ అరెస్టు చేసిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 

సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి అర్హతలు, అవసరమైన అనుమతులు లేకుండా వీసా ప్రాసెసింగ్‌ చేస్తున్న నిందితుడిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇతడిపై గతంలోనూ కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లి వచ్చాడని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి వెల్లడించారు. నగరంలోని కాలాపత్తర్‌ ప్రాంతానికి చెందిన సికిందర్‌ గతంలో వీడియోగ్రాఫర్‌గా పని చేశాడు. 2012లో దుబాయ్‌ వెళ్లిన ఇతగాడు అక్కడ కొన్నాళ్ల పాటు పని చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి వివిధ దేశాలకు చెందిన వీసాల ప్రాసెసింగ్‌పై అవగాహన వచ్చింది. దీంతో నగరానికి తిరిగి వచ్చిన తర్వాత వీసా ప్రాసెసింగ్‌ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. 2014లో వచ్చిన సికిందర్‌ ఎలాంటి అర్హతలు, అనుమతులు లేకుండా ఈ దందా ప్రారంభించాడు.

అనేక మందికి ఎర వేసి స్టడీ, విజిట్, బిజినెస్‌ వీసాలు ఇప్పించి పంపాడు. అక్రమంగా చేస్తున్న ఈ దందా నేపథ్యంలో ఇతడిపై గతంలో ఫలక్‌నుమా, ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్, శంషాబాద్, కాలాపత్తర్‌ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టు అయిన ఇతగాడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయినా తన పంథా మార్చుకోని సికిందర్‌ వీసా ప్రాసెసింగ్‌ దందా కొనసాగించాడు. అక్రమంగా వీసా ప్రాసెసింగ్‌ చేస్తూ ఒక్కో వీసాకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్‌ఐలు వి.నరేందర్, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ థక్రుద్దీన్‌ తమ బృందాలతో దాడి చేసి బుధవారం అరెస్టు చేశారు. నలుగురికి చెందిన పాస్‌పోర్టులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును కాలాపత్తర్‌ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు