కోర్టులో కాల్పుల మోత

25 Sep, 2021 04:47 IST|Sakshi
కాల్పులు జరుగుతున్న దృశ్యం. (ఇన్‌సెట్‌లో) గ్యాంగ్‌స్టర్‌ జితేంద్ర గోగి(ఫైల్‌)

ఢిల్లీలోని రోహిణి కోర్టులో తెగబడిన దుండగులు

గ్యాంగ్‌స్టర్‌ జితేంద్ర గోగి హత్య

పోలీసుల ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతం  

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో న్యాయస్థానంలో కాల్పులు జరగడం, ముగ్గురు మరణించడం కలకలం సృష్టించింది. విచారణ కోసం తీసుకొచి్చన వ్యక్తిని అతడి ప్రత్యర్థులు కోర్టు గదిలో కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండుగులు హతమయ్యారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం 30 ఏళ్ల జితేంద్ర గోగి ఢిల్లీలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌. పలు కేసుల్లో ప్రధాన నిందితుడు. దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తను రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించిన వ్యవహారంలో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్నాడు.

ఈ కేసు విచారణలో భాగంగా జడ్జి ఎదుట ప్రవేశపెట్టడానికి శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు రోహిణి కోర్టులోని 207నంబర్‌ గదికి తీసుకొచ్చారు. ఇద్దరు దుండగులు న్యాయవాదుల దుస్తుల్లో లోపలికొచ్చి పిస్టోళ్లతో గోగిపై కాల్పులు జరిపారు. దాదాపు ఆరు తూటాలు శరీరంలోకి దూసుకెళ్లడంతో గోగికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరపడంతో ఆ ఇద్దరు దుండుగులు హతమయ్యారు. చికిత్స కోసం గోగిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దుండగుల కాల్పుల్లో కోర్టు గదిలో ఉన్న ఓ మహిళా న్యాయవాది కాలులోకి తూటా దూసుకెళ్లింది.

రోహిణి కోర్టులో జరిగిన కాల్పులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని ఢిల్లీ బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. భద్రతను పెంచేదాకా తాము కోర్టులకు హాజరు కాబోమని న్యాయవాదులు తేల్చిచెప్పారు. గోగిపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు అతడి ప్రత్యర్థి టిల్లూ తాజ్‌పూరియా వర్గానికి చెందినవారేనని, వారిలో ఒకడిపై రూ.50 వేల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. వారిద్దరిని ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌కు చెందిన రాహుల్, బక్కర్‌వాలా గ్రామానికి చెందిన మోరిస్‌గా గుర్తించారు. జితేంద్ర గోగి, టిల్లూ తాజ్‌పూరియా అలియాస్‌ సునీల్‌ అలీపూర్, సోనిపట్‌ పట్టణాల్లో దోపిడీ రాకెట్లు నడిపేవారు. ఇరు వర్గాల మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగాయి. కాల్పులు చోటుచేసుకున్నాయి. గత ఆరేళ్లలో ఇరు వర్గాలకు చెందిన వారు పది మందికిపైగా మృతి చెందారు.

కళాశాల నుంచే కక్షలు  
జితేంద్ర గోగి, టిల్లూ తాజ్‌పూరియా మధ్య కళాశాల స్థాయి నుంచే వైరం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరూ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లో చేరారు. తరచూ గొడవలకు దిగేవారు. శత్రుత్వం పెరిగిపోయింది. 2012లో టిల్లూ స్నేహితుడు వికాస్‌ను గోగి వర్గం కాల్చి చంపేసింది. 2015లో సోనిపట్‌ పోలీసులు టిల్లూను అరెస్టు చేశారు. ప్రస్తుతం సోనిపట్‌ జైల్లోనే ఉన్నాడు. టిల్లూను ఎలాగైనా అంతం చేయాలని గోగి ఎప్పటి నుంచో యత్నిస్తున్నాడు. 2016లో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న గోగి తదనంతరం టిల్లూ వర్గంలో చాలామందిని హతమార్చాడు.

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆందోళన
రోహిణి కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్‌ పటేల్‌తో మాట్లాడారు. కోర్టు గదిలో కాల్పులు, దుండగుల మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులతో, బార్‌ అసోసియేషన్‌తో చర్చించి, న్యాయస్థానం కార్యకలాపాలకు  విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యాయస్థానాలతోపాటు న్యాయవాదులు, న్యాయమూర్తుల రక్షణకు సుప్రీంకోర్టు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. ఈ అంశం వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.  
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు