ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌.. చెల్లెలితో కలిసి ఆడుకుంటుండగా

15 Jun, 2022 09:47 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

పొరపాటున పగిలిపోయిన ఫోన్‌

తండ్రి తిడతాడని కుమార్తె ఆత్మహత్యా యత్నం

చికిత్స పొందుతూ మృతి

పిఠాపురం: ఆ అమ్మాయి చేతిలో నుంచి సెల్‌ఫోన్‌ పొరపాటున జారి పడి పగిలిపోయింది. తండ్రి తిడతాడన్న భయంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చిన జగ్గంపేటలో మంగళవారం చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన సారిపల్లి నాగన్నది నిరుపేద కుటుంబం. భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కష్టపడి పెద్ద కుమార్తెకు వివాహం చేశాడు. రెండో కుమార్తె సత్యవేణి (16) ఆరో తరగతి వరకూ చదివి మానేసింది. ఆమె స్నేహితులందరూ ఎప్పటి నుంచో సెల్‌ఫోన్‌ వాడుతున్నారు. తనకూ కొనిపెట్టమని తండ్రిని తరచుగా అడిగేది. అయితే అంత స్థోమత లేదంటూ కుమార్తెకు నాగన్న నచ్చజెబుతూండేవాడు.

చదవండి: (Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం) 

కుమార్తె కోరిక తీర్చేందుకు అప్పు చేసి, 11వ తేదీన కొత్త సెల్‌ఫోన్‌ కొని ఇచ్చాడు. అదే రోజు చెల్లెలితో కలిసి ఆ ఫోనుతో సత్యవేణి ఆడుకుంటూండగా, ఒక్కసారిగా అది కింద పడి పగిలిపోయింది. విషయం తెలిస్తే తండ్రి తిడతాడని సత్యవేణి భయపడింది. పొలానికి కొట్టడానికని నాగన్న గడ్డి మందు కొని తెచ్చి, బాత్‌రూములో పెట్టాడు. సత్యవేణి ఆ మందు తాగి ఎవరికీ చెప్పకుండా పడుకుని ఉండిపోయింది.

కొంతసేపటికి వాంతులు కావడంతో ఏమైందని అడగ్గా గడ్డి మందు తాగినట్టు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి నుంచీ అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందింది. గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (తనకెవ్వరూ సాటిరారని నిరూపించాడు.. దానిని తట్టుకోలేకే చంపేశారా?)

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు