మరో యువతితో పెళ్లి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు షాకిచ్చిన ప్రియురాలు

18 Aug, 2022 16:18 IST|Sakshi

గుత్తి రూరల్‌ (అనంతపురం/కర్నూలు): ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడు. మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి బాధితురాలు, వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం ఇసురాళ్లపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
చదవండి: మీరు తింటున్న చికెన్‌ బిర్యానీలో ఏముందో తెలుసా?.. భయంకర వాస్తవాలు

ఇసురాళ్లపల్లికి చెందిన రమేష్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ యువతి ఇసురాళ్లపల్లిలో బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో రమేష్‌ ప్రేమిస్తున్నానంటూ  వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె కూడా ప్రేమకు అంగీకరించింది. కొంతకాలం ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.

అయితే.. అతను ప్రేమించిన యువతిని మోసం చేసి, జిల్లాలోని పెద్దవడుగూరు మండలం వీరేపల్లికి చెందిన మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. బుధవారం ఇసురాళ్లపల్లిలోని ఆనందాశ్రమంలో వివాహం జరుగుతున్న విషయం బాధితురాలికి తెలిసింది. వెంటనే ఆమె గుత్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రమేష్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు కూడా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ విషయాన్ని దాచి తమనూ మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇరువురి ఫిర్యాదు మేరకు వరుడు రమేష్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

మరిన్ని వార్తలు