ప్రేమలో గెలిచారు.. జీవితంలో ఓడారు

26 Jun, 2022 07:12 IST|Sakshi

ఉప్పల్‌: వారిద్దరూ ఒకనొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రేమను గెలిచారు. కానీ జీవితంలో ఓటమి పాలయ్యారు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అసువులు బాశారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు.. నగరంలోని రామంతాపూర్‌ శ్రీనగర్‌ కాలనీకి చెందిన కొత్త సాయిగౌడ్‌ (30), మీర్‌పేటకు చెందిన సందూర్‌ నవనీత (28)కు మౌలాలిలో ఉన్న సూపర్‌ మార్కెట్‌లో పరిచయమైంది.

నాలుగేళ్లుగా  ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సాయిగౌడ్, నవనీత ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకుని రామంతాపూర్‌లోని శ్రీనగర్‌ కాలనీలో అద్దె ఇంట్లో కాపురముంటున్నారు. నవనీత ప్రైవేట్‌ కాల్‌ సెంటర్‌లో పని చేస్తుండగా సాయిగౌడ్‌ పెస్ట్‌ కంట్రోల్‌ ఉద్యోగం చేసేవాడు. కొంత కాలంగా సాయిగౌడ్‌ ఉద్యోగం పోయి మద్యానికి బానిసయ్యాడు.

నిత్యం మద్యం తాగి  వస్తుండటంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే విషయాన్ని నవనీత తన తల్లిదండ్రులకు చెబుతుండేది. శుక్రవారం సాయంత్రం నుంచీ నవనీత సోదరుడు నవీన్‌ ఫోన్‌ చేస్తున్నా కాల్‌ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో శనివారం ఉదయం రామంతాపూర్‌లోని సోదరి ఇంటికి వచ్చి చూడగా సాయిగౌడ్, నవనీత విగత జీవులుగా కనిపించారు. నవీన్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి వచ్చారు. మొదట నవనీత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు, ఆ తర్వాత ఆమె చున్నీతో సాయిగౌడ్‌ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.  

(చదవండి: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనుక్కోండి!)

మరిన్ని వార్తలు