అనుమానం: భార్యతోపాటు మరో మహిళను..

12 Oct, 2020 11:02 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: అనుమానంతో ఓ భర్త భార్యను, ఆమెకు సహకరిస్తోందనే కారణంగా మరో మహిళను దారుణంగా హత్య చేశాడు. అత్యంత కిరాతకంగా భార్య తల, మొండెం వేరు చేయగా, ఇంకో మహిళను విచక్షణా రహితంగా కత్తితో నరికి చంపాడు. నెల్లూరు రూరల్‌ మండలంలోని నవలాకులతోట నాల్గో మైలు వద్ద జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. విడవలూరు మండలం పొన్నపూడి ప్రశాంతిగిరినగర్‌కు చెందిన కొమరి నాగేశ్వరరావు మత్స్యకారుడు. మొదటి భార్య గోవిందమ్మ చనిపోవడంతో ఇందుకూరుపేట మండలం మైపాడుకు చెందిన నిర్మలమ్మ (43)ను 19 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమార్తె ఉంది. నెల్లూరులోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది.

మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు కాగా వివాహం చేశాడు. నాగేశ్వరరావు ప్రొక్లెయిన్‌ వాహనాలను అద్దెకు తీసుకుని నడుపుతుండేవాడు. ఇటీవల ఫైనాన్స్‌ ద్వారా ప్రొక్లెయిన్‌ను కొనుగోలు చేసి పనులు చేయిస్తున్నాడు. కొంతకాలంగా నాగేశ్వరరావు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ప్రశాంతిగిరినగర్‌కు చెందిన రంగంగారి వెంకటరమణమ్మ (42) తన భార్యకు సహకరిస్తోందని భావించాడు.  ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ప్రశాంతిగిరినగర్‌ నుంచి కాపురాన్ని నెల్లూరుకు మార్చాడు. తొలుత కిసాన్‌నగర్‌లో కాపురం పెట్టాడు. రెండు నెలల క్రితం నవలాకులతోటలో ఓ అద్దె ఇంట్లోకి కాపురాన్ని మార్చాడు. అయితే భార్య నిర్మలమ్మ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పురాకపోవడంతో అతిగా మద్యం తాగి  తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో భార్యను ఎలాగైనా అంతమొందించాలని భావించాడు.

కుమార్తె లేని సమయంలో..
ఇటీవల నిర్మలమ్మ కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లింది. ఇదే అదనుగా నాగేశ్వరరావు భార్యను తుదముట్టించేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో భార్య నిర్మలమ్మతో  గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగడంతో భార్యపై కత్తి తో విచక్షణా రహితంగా తలను, మొండెంను వేరు చేశాడు. అనంతరం రక్తపు మడుగును శుభ్రం చేసి  ఎవరికీ అను మానం రాకుండా నిర్మలమ్మ నిద్రపోతున్నట్లుగా నమ్మించేందుకు మొండెంను పడక గదిలో ఉంచి దుప్పటి కప్పాడు. 

పొలం విషయం మాట్లాడుదామని..
నిర్మలమ్మను హత్య చేసిన నాగేశ్వరరావు దూరపు బంధువు అయిన వెంకటరమణమ్మను హత్య చేయాలని భావించాడు.  ఉదయం వెంకటరమణమ్మకు ఫోన్‌ చేసి పొలం కొనాలనుకున్నావు కదా మాట్లాడుదాం రమ్మని పిలిచాడు. దీంతో ఆమె ఉదయం 10 గంటల సమయంలో నెల్లూరులోని నాగేశ్వరరావు ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరిన ఆమెç కత్తితో దాడి చేశాడు. తల వెనుక భాగం, కాళ్లు చేతులను విచక్షణ రహితంగా నరికివేశాడు. దీంతో వెంకటరమణమ్మ మృతి చెందింది. వెంకటరమణమ్మ సాయంత్రానికి ఇంటికి చేరకపోవడంతో పెద్దకుమారుడు బాలాకుమార్‌ ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం వేకువ జామున నిందితుడు నాగేశ్వరరావు నెల్లూరురూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోవడంతో హత్యల ఘటన వెలుగుచూసింది.

విషయం తెలుసుకున్న హతురాళ్ల బంధువులు, కుటుంబ సభ్యులు, నెల్లూరురూరల్‌ పోలీసులు ఆదివారం వేకువన 3 గంటల సమయంలో నాగేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. నెల్లూరురూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై నాగార్జునరెడ్డి తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లోని హాల్‌లో రక్తమడుగులో వెంకటరమణమ్మ మృతదేహాన్ని గుర్తించారు. బెడ్‌రూంలో నిర్మలమ్మ మొండెంకు దుప్పటి కప్పి ఉండడాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నెల్లూరురూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఇందుకూరుపేట మండలం మైపాడు, ప్రశాంతిగిరినగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా