-

30 ఏళ్ల నేర చరిత్ర 160 చోరీలు, 22 సార్లు అరెస్టు.. ఇది మనోడి ట్రాక్‌ రికార్డ్‌

12 Aug, 2021 08:29 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అసలు పేరు మహ్మద్‌ సలీం. బాలీవుడ్‌ నటుడిపై అభిమానంతో తన పేరును సునీల్‌ శెట్టిగా మార్చుకున్నాడు. సొంత దుకాణం నుంచే చోరీలు చేయడం ప్రారంభించాడు. 30 ఏళ్ల నేర చరిత్రలో 160 చోరీలు చేశాడు. ఇప్పటి వరకు ఇరవైరెండు సార్లు అరెస్టయ్యాడు. గత మార్చిలో జైలు నుంచి వచ్చి అయిదు నెలల్లో 12 నేరాలు చేశాడు. చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలు చేయడంతో పాటు హెలీటూరిజం సైతం చేస్తుంటాడు. ఈ ఘరానా దొంగను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూ.18 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. బుధవారం అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  

హోటల్‌లో కార్మికుడిగా చేరి.. 
►ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్‌ లాంతర్ల కర్మాగారంలో పని వాడిగా చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలెట్టాడు.  
►ఈ విషయం బయటకు వచ్చేసరికి ఇల్లు వదిలి పారిపోయి చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్‌లో కార్మికుడిగా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా గృహోపకరణాలు తస్కరించడం మొదలెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్‌ఘాట్‌ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. అక్కడ ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులగొట్టడంలో మెలకువలు నేర్చుకున్నాడు.  

ఆ ఇళ్లే టార్గెట్‌.. 
►ప్రధానంగా మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాల ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుంటాడు.   చిన్న టార్చిలైట్, కటింగ్‌ ప్లేయర్‌తో ‘రంగం’లోకి దిగే ఇతగాడు తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్‌ చేసినప్పటికీ తాళం పగులగొట్టడు. గోడ దూకి సజ్జె ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్‌ వాహనాలు ఆ ప్రాంతానికి వచి్చనా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు దృష్టిపెట్టరని ఇలా చేస్తుంటాడు.  
►లోపలకు వెళ్లాక చెంచాలు సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగులగొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. ఈ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో ముంబై, అజ్మీర్‌ సహా ఉత్తరాదిలో జల్సాలు చేస్తుంటాడు.  వ్యభిచారిణుల వద్దకు వెళ్లే అలవాటు ఉన్న సలీం ఓసారి రూ.12 లక్షల చోరీ సొత్తుతో ముంబైలోని ఓ మహిళ వద్దకు వెళ్లాడు.  


►ఇతడు నిద్రపోతున్న సమయంలో ఆ సొత్తు కాజేసి ఆమె ఉడాయించింది. బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి అంటే ఇష్టపడే సలీం తన పేరునూ అలానే మార్చుకున్నాడు. ఇప్పటి వరకు 160 నేరాలు చేసి 22 సార్లు అరెస్టు అయినా.. శిక్షలు పూర్తయ్యే వరకు జైలు నుంచి రాని నేపథ్యంలో ఒక్కసారే పీడీ యాక్ట్‌ ప్రయోగం సాధ్యమైంది.  
►2018లో జైలుకు వెళ్లి గత మార్చిలో బయటకు వచ్చాడు. అప్పటి నుంచి వరుస మూడు కమిషనరేట్లలోని 5 ఠాణాల పరిధిలో 12 నేరాలు చేశాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు కె.చంద్రమోహన్, వి.నరేందర్, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ థకియుద్దీన్‌ తమ బృందాలతో వలపన్ని పట్టుకున్నారు.   

మరిన్ని వార్తలు