అవసరాల కోసం అడ్డదారులు.. చివరికి

2 Sep, 2021 21:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవసరాల కోసం అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని దొంగతనానికి పాల్పడిన యువకులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలోని ఎల్‌ఆర్‌ఆర్‌ 9 ఎంటర్‌ ప్రైజెస్‌లో నాలుగు రోజుల క్రితం రూ.25 లక్షలు విలువ చేసే బోర్‌వెల్‌ బిట్స్‌ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. డీఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లేత్‌మిషన్‌ పనిచేసే దమ్మాయిగూడకు చెందిన హరికృష్ణ(32), వెల్డర్‌గా పనిచేసే కట్టింగ్‌కాలనీకి చెందిన దుర్గేష్‌ (37) మిత్రులు.

హరికృష్ణ ఎల్‌ఆర్‌ఆర్‌9 ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ ఎదురుగా ఉన్న తన సోదరుడి కంపెనీలో పనిచేస్తున్నాడు. వ్యసనాలకు, కుటుంబ అవసరాలకు జీతం సరిపోయేది కాదు. దీంతో నిత్యం ఎదురుగా ఉన్న కంపెనీలో బోర్‌వెల్స్‌ బిట్స్‌ లోడింగ్‌ చేయడాన్ని గమనించేవాడు. బిట్స్‌ను దొంగిలించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. తన ఫ్లాన్‌ను దుర్గేష్‌కు వివరించాడు. అందుకు దుర్గేష్‌ ఓకే చెప్పడంతో చోరీకి పక్క ప్లాన్‌ చేశారు. తెలిసిన వారి వద్ద ఓ ఓమీనీ వ్యాన్‌ను ఎంగేజ్‌ చేసుకున్నారు. ఆగస్టు 28 రాత్రి 12:30గంటల సమయంలో ఇద్దరు తాళ్లూరి థియేటర్‌ వద్ద కలుసుకున్నారు. ప్లాన్‌ ప్రకారం ముందుగానే కంపెనీ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల కనెక్షన్‌ కట్‌ చేసి కంపెనీలోకి ప్రవేశించారు.

షట్టర్‌ ఓపెన్‌ కాకపోవడంతో కిటికీ గ్రిల్స్‌ తొలగించి లోనికి ప్రవేశించారు. విలువైన బిట్స్‌ను దోచుకెళ్లినట్లు డీఐ వివరించారు. సమీప సీసీ కెమెరాల్లో లభించిన ఆధారాలతో రంగంలోకి దిగిన పోలీసులు 7 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టి బుధవారం వ్యాన్‌లో వెళ్తున్న వారిని చక్రిపురం చౌరస్తా సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.   

చదవండి: ఏమైందో? ఏమో?..అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

మరిన్ని వార్తలు