పోస్టాఫీస్‌లో భారీ చోరీ.. నిందితుడు స్వీపర్‌

28 Feb, 2022 05:26 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి తదితరులు  

  

రూ.28.52 లక్షలు స్వాధీనం 

గచ్చిబౌలి: పన్పెండేళ్లుగా స్వీపర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి పని చేస్తున్న సంస్థకే కన్నం వేశాడు. రాత్రి ఆఫీస్‌లోకి ప్రవేశించి రూ.33.29 లక్షలు చోరీ చేశాడు.  ఆదివారం గచ్చిబౌలిలో మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న అర్ధరాత్రి  బీహెచ్‌ఈఎల్‌లోని సబ్‌ పోస్టాఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పిన అనంతరం గ్రిల్స్‌ తొలగించి ఉండటం గమనించారు.

దీంతో అక్కడ చోరీ జరిగినట్లు గుర్తించారు.  పోస్టుమాస్టర్‌ చౌహన్‌ శంకర్‌ ఆర్సీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా చోరీ జరిగిన రోజు నుంచి 12 ఏళ్లుగా స్వీపర్‌గా పని చేస్తున్న జహీర్‌(25) విధులకు రాలేదు. దీంతో అతనిపై నిఘా ఉంచారు. అతను గోవాకు వెళ్లి మూడు రోజులు ఉన్నట్లుగా కనుగొన్నారు. నగరానికి తిరిగి రాగానే అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు నుంచి రూ.28,52,170 నగదు, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న జహీర్‌ చోరీ చేయడాన్ని ట్యూబ్‌లో చూసి దొంగతనం చేశాడు.  నగదు ఎక్కువ డిపాజిట్‌ అయిన రోజు రాత్రి వాచ్‌మెన్‌ లేడనుకొని నిర్ధారించుకొని ఈ చోరీ చేశాడు.   మియాపూర్‌ ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐ సంజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు