మహిళలపై పెరుగుతున్న క్రైమ్‌

12 Oct, 2020 14:40 IST|Sakshi

గత నాలుగేళ్లలో మహిళలపై పెరిగిన అఘాయ్యితాలు

పీడిత కులాల మహిళలపైనే అధిక దాడులు

యూపీలో 66.7 శాతం కేసులు నమోదు

 

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కల్లోలం రేపిన హాథ్రస్‌ దళిత యువతి అత్యాచారం చోటు చేసుకున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో మహిళలకు వ్యతిరేకంగా క్రైమ్‌ రేటు ఏకంగా 66.7 శాతం పెరిగిందని సెప్టెంబర్‌ 19వ తేదీన ‘క్రైమ్‌ ఇన్‌ ఇండియా 2019’ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులల మహిళలకు వ్యతిరేకంగా 37 శాతం రేప్‌ సంఘటనలు పెరగ్గా, 20 శాతం భౌతిక దాడులు పెరిగాయి. దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్‌ కులాల మహిళలకు వ్యతిరేకంగా రేప్‌ సంఘటనలు సరాసరి 23.3 శాతం పెరగ్గా, హింసాత్మక సంఘటనలు 18.8 శాతం పెరిగింది. షెడ్యూల్డ్‌ కులాల మహిళలపైనే కాకుండా మొత్తంగా దేశంలోని మహిళలపై దాడులు పెరిగాయి.

గత నాలుగేళ్ల కాలంలో దేశంలోని మహిళలకు వ్యతిరేకంగా ఓ పక్క దాడులు పెరగ్గా మరోపక్క పెండింగ్‌ కేసులు కూడా పెరగడం విచిత్రమే. అన్ని కేటగిరీలకు చెందిన మహిళలపై పెండింగ్‌ కేసులు 29.3 శాతం పెరగ్గా, ఎస్‌సీ మహిళలకు వ్యతిరేకంగా పెండింగ్‌ కేసుల సంఖ్య 33.8 శాతంకు పెరిగాయి. మహిళలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో కేవలం 7.6 శాతం కేసులే పరిష్కారమయ్యాయి. షెడ్యూల్డ్‌ మహిళలకు సంబంధించిన కేసుల్లో ఈ సంఖ్య 6.1 శాతానికే పరిమితమైంది. 40 శాతం కేసుల్లో నేరానికి సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కొట్టివేయడం కనిపిస్తోంది.

మహిళలకు వ్యతిరేకంగా గత నాలుగేళ్లలో పెరుగుతున్న నేరాల్లో కేసులు నమోదవడం కూడా ఎక్కువే జరుగుతోంది. కట్నం చావులు, కట్నం కోసం భర్త, ఇతర కుటుంబ సభ్యులు హింసకు పాల్పడడం, లైంగిక దాడులు, ఆసిడ్‌ దాడులు, కిడ్నాప్‌లు, అక్రమ రవాణా తదితర నేరాలను మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలుగా పరిగణలోకి తీసుకున్నారు. 2015 సంవత్సరంతో పోలిస్తే 2019 సంవత్సరానికి ఈ కేసుల నమోదు కూడా దేశవ్యాప్తంగా సరాసరి 7.3 శాతం పెరిగింది. ఈ సంఖ్య కూడా యూపీలో ఎక్కువగా ఉంది. యూపీలో 66.7 శాతం కేసులు నమోదుకాగా, హర్యానాలో 54.4 శాతం, రాజస్థాన్‌లో 47.2 శాతం, ఒడిశా, బిహార్‌ రాష్ట్రాల్లో 34, 35 శాతం కేసులు నమోదయ్యాయి. 2014 సంవత్సరంతో పోలీస్తే 2019 సెప్టెంబర్‌ 29వ తేదీ నాటికి యూపీలో మహిళలకు వ్యతిరేకంగా జరిగిన దాడుల కేసులో ఏకంగా 15 శాతం పెరిగాయి. (హథ్రాస్‌ : నిందితుడిపై కేసు నమో​దు చేసిన సీబీఐ)

మరిన్ని వార్తలు