యూఎస్‌లో దారుణం: ‘మీ అమ్మ, బామ్మను చంపేశా’

26 Aug, 2020 17:20 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన ఓ మాజీ అథ్లెట్‌ తన తల్లిని, భార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అనంతరం తనను గాయపరచుకున్నాడు. ఆ తర్వాత తనే పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం అందించాడు. పెన్సిల్వేనియాలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఇక్బాల్‌ సింగ్‌(62) అనే వ్యక్తి 1983 ఏషియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొని కాంస్య పతకం గెలుచుకున్నాడు. కువైట్‌లో జరిగిన ఈ క్రీడా ఈవెంట్‌ తర్వాత కొన్నాళ్లకు అతడు అమెరికాకు వలస వెళ్లాడు. టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబంతో సహా డెలావర్‌ కౌంటీలో స్థిరపడ్డాడు. అక్కడే న్యూటౌన్‌ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్నాడు. (చదవండి: చనిపోయిన బాలిక బతికింది: గంట తర్వాత..)

ఏమైందో తెలియదు గానీ.. ఇక్బాల్‌ సింగ్‌ ఆదివారం అకస్మాత్తుగా తన తల్లి నసీబ్‌ కౌర్‌, భార్య జస్పాల్‌ కౌర్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. వారిద్దరిని గొంతుకోసి హతమార్చాడు. ఆ తర్వాత తనను తాను అదే రీతిలో కత్తితో గాయపరచుకున్నాడు. అనంతరం తన కొడుకుకు ఫోన్‌ చేసి.. ‘‘వాళ్లిద్దరిని చంపేశాను. మీ అమ్మ, బామ్మను హత్య చేశాను. పోలీసులను రమ్మను’’అని చెప్పాడు. కూతురికి కూడా ఇదే విషయం గురించి ఫోన్‌లో వివరించాడు. తర్వాత తానే పోలీసులకు ఫోన్‌ చేసి నేరం చేసిన తనను అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశాడు.(చదవండి: కరోనా హాట్‌స్పాట్‌గా న్యూడిస్ట్‌ల రిసార్ట్‌ )

దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇక్బాల్‌ సింగ్‌ను తొలుత ఆస్పత్రికి తరలించారు. అనంతరం హత్యానేరం కింద అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా నిందితుడికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఇక రెండు హత్యలు చేసిన ఇక్బాల్‌ సింగ్‌కు బెయిలు మంజూరు చేసేందుకు స్థానిక కోర్టు నిరాకరించింది. కాగా ఇక్బాల్‌ ఎప్పుడూ అపార్టుమెంటు పరిసరాల్లో మెడిటేషన్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేవాడని, అయితే హత్యలకు ముందురోజు కాస్త ఆందోళనగా కనిపించాడని ఇరుగుపొరుగు వారు చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు