కమీషన్లకు కక్కుర్తీ..కలెక్టర్ నోటీసులు!

5 Mar, 2021 08:44 IST|Sakshi

కమీషన్లకుకక్కుర్తి

పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం

ఇష్టారీతిగా బిల్లులు 

జైన సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శి సస్పెన్షన్‌ 

ప్రతీ నెల జిల్లాలోని జీపీలకు రూ.9.17 కోట్లు

జగిత్యాల/ధర్మపురి: జిల్లాలోని కొన్ని గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో కలెక్టర్‌ రవి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. సరైన కారణంతో సంజాయిషి ఇవ్వని సర్పంచులు, కార్యదర్శులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. బుధవారం జిల్లాలోని ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌తోపాటు గ్రామపంచాయతీ కార్యదర్శులను ఆరు నెలలపాటు సస్పెన్షన్‌ విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

రూ.37.03 లక్షల లెక్కలపై నిర్లక్ష్యం

జిల్లాలోని ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్‌ జె.ప్రభాకర్‌రావు, ఉపసర్పంచ్‌ కురిక్యాల మహేశ్, పంచాయతీ కార్యదర్శి పాషా గ్రామపంచాయతీ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడంతోపాటు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారనే కారణాలతో కలెక్టర్‌ ఆరునెలల పాటు సస్పెన్షన్‌ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. గ్రామపంచాయతీకి చెందిన నిధులు రూ.37,03,865 సంబంధించిన రికార్డులు చూపించకపోగా కలెక్టర్‌ జారీచేసిన షోకాజ్‌ నోటీసులకు సమాధానం సైతం ఇవ్వలేదు. దీంతో పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ముగ్గురిపై సస్పెన్షన్‌ విధించారు.  

ప్రతీ నెల రూ.9.17 కోట్లు 

జిల్లాలోని 380 గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రతీ నెల రూ.9.17 కోట్లు మంజూరు చేస్తోంది. గ్రామాల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తుండగా, ఆయా నిధులను పల్లెప్రగతి పనులతో పాటు వైకుంఠదామాలు, పల్లెప్రకృతి వనాలు, శాని టేషన్, పంచాయతీ నిర్వహణ కోసం పాలకవర్గాలు వినియోగిస్తున్నాయి. గతేడాది జిల్లాలో సుమారు రూ.110 కోట్లు గ్రామపంచాయతీల నిధుల రూపంలో జీపీలకు చేరాయి. కొన్ని గ్రామాల్లో నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. చాలా వరకు గ్రామాల్లో శ్మశానవాటిక పనులు పూర్తి కాలేదు. డంపింగ్‌యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లు, కంపోస్ట్‌యార్డుల నిర్మాణాలు సైతం నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చూపడంతోపాటు నిధుల్లో పారదర్శకత లేని 8 మంది సర్పంచులకు కలెక్టర్‌ రవి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ధర్మపురి మండలం జైన, రాజారం, రాయికల్‌ మండలం ధర్మాజీపేట, వెల్గటూర్‌ మండలం గుల్లకోట, చెగ్యాం, వెల్గటూర్, కథలాపూర్‌ మండలం బొమ్మెన, కోరుట్ల మండలం పైడిమడుగు సర్పంచులకు గతంలో షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి.  

దుర్వినియోగం ఇలా.. 

ధర్మపురి మండలంలోని జైనాలో హరితహారంలో భాగంగా కొనుగోలు చేసిన ట్రీగార్డులలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2019–2020లో 1,600 ట్రీగార్డులను కొనుగోలు చేశారు. ఒక్కో ట్రీగార్డుకు రూ.54 చొప్పున రూ.86,400 చెల్లించాల్సి ఉండగా.. రూ.1.92లక్షల విలువైన ట్రీగార్డులు కొన్నట్లు రికార్డులు చూపించినట్లు నిర్ధారణయ్యింది. సాధారణ నిధుల కింద రూ.1.95లక్షలు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.7,95,845, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.27,13,020 మొత్తం రూ.37,03,865 నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ నుంచి షోకాజ్‌ నోటీలు జారీ చేశారు. వీటిపై 15 రోజుల్లోగా స్పందించకపోవడంతో సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ధర్మపురి మండలంలోని రాయపట్నంలో రూ.4 లక్షలు, బుగ్గారం పంచాయతీలో రూ.2.40 లక్షలు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు రావడంతో షోకాజ్‌ నోటీస్‌లు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా సంజాయిసీ ఇవ్వాలని కోరారు.  
 

మరిన్ని వార్తలు