కర్ణాటక: చేతబడికి గురైనట్లు అనుమానిస్తున్న రెండేళ్ల చిన్నారి మృతి

2 Oct, 2021 13:54 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో చేతబడికి గురైనట్లు అనుమానిస్తున్న రెండేళ్ల చిన్నారి మరణించింది. బెలగావి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసింది. అయితే ఇప్పటికీ ఆ చిన్నారి ఎవరనే విషయం తెలియరాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. దీనిపై పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

కాగా సెప్టెంబర్‌ 24న బెలగావిలోని హల్యాలా గ్రామం వద్ద ఉన్న చెరుకు పొలంలో రెండేళ్ల బాలికను బట్టలో చుట్టి పడేసినట్లు కొంతమంది రైతులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక శరీరంపై కాలిన గాయాలు ఉండటంతో చేతబడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాధితురాలి ఒంటిపై సిగరెట్‌ పీకలు, కెమికల్స్‌ వాడినట్లు కనిపించడంతో ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానించారు. కానీ ప్రాథమిక దర్యాప్తులో చిన్నారిపై అత్యాచారం జరగలేదని తేలింది. 

అయితే ఆసుపల్రిలోని బాలిక ముందుగా కోలుకుంటున్న లక్షణాలు కనిపించినప్పటికీ మళ్లీ సిరీయస్‌ అయ్యిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, ఇప్పటి వరకు ఎవరూ కూడా మిస్సింగ్‌ కేసు నమోదు చేయలేదని తెలిపారు. కూతురు మిస్‌ అయినట్లు తల్లిదండ్రుల ఫిర్యాదు చేయకపోవడంతో ఈ ఘటనలో వారి పాత్ర ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారిని గుర్తించేందుకు కర్ణాటకతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు పాప  ఫోటోను పంపించారు.  

మరిన్ని వార్తలు