రూ.110 కోట్ల కార్వీ ఆస్తుల జప్తు

31 Jul, 2022 04:52 IST|Sakshi

ఇప్పటివరకు మొత్తం రూ.2,095 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

సాక్షి, హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ఎండీ పార్థసారథికి చెందిన రూ.110 కోట్ల విలువైన భూములు, బంగారు ఆభరణాలు, విదేశీ నగదు, షేర్లను జప్తు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పార్థసారథితోపాటు సీఎఫ్‌వో జి.హరికృష్ణను గతంలో అరెస్ట్‌ చేయగా, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నట్టు ఈడీ వెల్లడించింది.

హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌లోని సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ కార్వీ సంస్థతోపాటు చైర్మన్, ఎండీ, తదితరులకు చెందిన రూ.1,984 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది. తాజాగా చేసిన రూ.110 కోట్ల ఆస్తులతో కలిపి మొత్తంగా రూ.2,095 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు స్పష్టం చేసింది. కార్వీ సంస్థలో షేర్‌ హోల్డర్లను మోసం చేసి వారి షేర్ల మీద రూ.2,800 కోట్ల మేర రుణం పొంది ఎగొట్టిన కేసుల్లో పార్థసారథిపై దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో కేసులు నమోదయ్యాయి.

ఆ రుణాలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి మళ్లించడంతోపాటు పలు షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి పేర్ల మీద సైతం రుణం పొందినట్టు ఈడీ గుర్తించింది. షేర్‌ హోల్డర్లు ఇచ్చిన పవర్‌ ఆఫ్‌ అటార్నీని దుర్వినియోగం చేసి రుణం పొందడంతోపాటు కేడీఎంఎస్‌ఎల్, కేఆర్‌ఐఎల్‌ కంపెనీలకు మళ్లించి వాటిని లాభాల్లో చూపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించింది.

రుణాల్లో కొంత భాగాన్ని కుమారులు రజత్‌ పార్థసారథి, అధిరాజ్‌ పార్థసారథికి జీతభత్యాలు, రీయింబర్స్‌మెంట్‌ పేరుతో దోచిపెట్టినట్టు ఈడీ గుర్తించింది. కార్వీ అనుబంధ సంస్థగా ఉన్న కేడీఎంఎస్‌ఎల్‌ ఎండీ వి.మహేశ్‌తోపాటు మరికొంత మంది కలిసి పార్థసారథి డైరెక్షన్‌లో మనీలాండరింగ్‌లో కీలకపాత్ర పోషించినట్టు ఈడీ వెల్లడించింది.   

మరిన్ని వార్తలు