ఏడేళ్ల క్రితం వివాహం.. మళ్లీ స్వప్నతో ప్రేమ.. కట్‌చేస్తే..

11 Sep, 2022 13:01 IST|Sakshi

సాక్షి, ములుగు(గజ్వేల్‌): తల్లిదండ్రులు తమ ప్రేమను నిరాకరించారని ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం అడవి మజీద్‌ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో శనివారం వెలుగు చూసింది.  ఎస్‌ఐ రంగాకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు మండలంలోని మామిడ్యాల ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన గొట్టి మహేశ్‌(28)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది.

ప్రస్తుతం ఇతడి భార్య కృష్ణవేణి గర్భవతి. కాగా మహేశ్‌ ఆరు నెలలుగా మర్కూక్‌కు చెందిన పదిరి స్వప్న(19)ను ప్రేమిస్తున్నాడు. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాను స్వప్నను పెళ్లి చేసుకుంటానని మహేశ్‌ తల్లిదండ్రులకు చెప్పగా వారు నిరాకరించారు. స్వప్న తల్లిదండ్రులు సైతం పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

మహేశ్‌ శనివారం తెల్లవారుజామున తమ బంధువు నవీన్‌కు తాము ఉరేసుకుంటున్న స్థలం లొకేషన్‌ను వాట్సాప్‌లో పంపించాడు. అడవిమజీద్‌ శివారులోని అటవీ ప్రాంతంలో వేప చెట్టుకు మహేశ్, స్వప్న ఉరేసుకున్నారు. కాగా మృతులకు ములుగు పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. గజ్వేల్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు మృతదేహాలను అప్పగించామని తెలిపారు. 

చదవండి: (ఒక క్లిక్‌తో డబ్బులు అని ఆశపడితే.. మీ చరిత్ర మొత్తం వారి చేతుల్లోకి..)

మరిన్ని వార్తలు