18 ఏళ్ల వ్యక్తితో 22 ఏళ్ల యువతి ప్రేమ: చివరకు నల్లమలలో

19 Jul, 2021 17:45 IST|Sakshi

లింగాల (అచ్చంపేట): ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వయసు మధ్య అంతరం ఉండడంతో పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి కుటుంబసభ్యులు వేరొకరితో నిశ్చితార్థం జరిపించి పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తట్టుకోలేక ఆ యువతి తన ప్రియుడితో కలిసి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్‌ గ్రామానికి చెందిన ఏదుల సలేశ్వరంగౌడ్‌ (18) ఇంటర్‌ చదివాడు. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి అదే గ్రామానికి చెందిన ఉడ్తనూరి రాధ (22) పరిచయమైంది. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన రాధ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామంలోనే ఉంటోంది. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి ప్రేమకు నిరాకరించారు. దీంతో రాధకు కుటుంబసభ్యులు కొన్ని రోజుల కిందట మరో వ్యక్తితో రాధకు నిశ్చితార్థం జరిపించారు. పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సలేశ్వరంగౌడ్‌ నాలుగు రోజుల కిందట హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చి రాధను తీసుకుని వెళ్లిపోయాడు.

వారిద్దరూ అదృశ్యమవడంతో ఇరు కుటుంబాల వారు గాలిస్తున్నారు. ఎంత వెతికినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం సాయంత్రం నల్లమల అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపుతున్న కాపరులకు రామచంద్రికుంట సమీపంలో వీరిద్దరూ ఉరి వేసుకుని కనిపించారు. విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయగా అక్కడికి వెళ్లి వారిని గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కృష్ణయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు