ప్రేమజంట ఉరి వేసుకుందా.. ఎవరైనా హత్య చేసి ఇలా..

16 Nov, 2022 07:51 IST|Sakshi

గుంటూరు: తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని కాకాని కుంట వద్ద జరిగింది. అద్దంకిలోని బత్తులవారిపాలేనికి చెందిన బత్తుల పెద్దిరాజు (22) ఇంటర్మీడియట్ చదివి ఇటుక బట్టీల్లో పొట్టు లారీల పనికి వెళ్తున్నాడు. అదే పట్టణంలోని కొత్తపేటకు చెందిన పల్లపోతు ప్రశాంతి (20) ఇంటర్మీడియట్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. 

వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ విషయం వారి పెద్దలకు తెలిసి మందలించారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని ప్రశాంతి ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, ప్రశాంతిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇద్దరి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. యువతి తల్లిదండ్రులు స్టేషన్‌లో పెళ్లికి అంగీకరించి ఇంటికి తీసుకువెళ్లారు.

 కానీ పెళ్లి చేయకుండా కాలయాపన చేస్తుండటంతో మనస్థాపం చెందిన పెద్దిరాజు, ప్రశాంతి సోమవారం అర్ధరాత్రి స్థానిక గరటయ్య కాలనీ సమీపంలోని కాకాని కుంట వద్దకు చేరుకుని చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని మృతిచెందారు. పెద్దిరాజు తండ్రి బత్తుల కృష్ణ ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంనికి తరలించారు. ప్రేమజంట ఉరి వేసుకుందా.. ఎవరైనా హత్య చేసి ఇలా చెట్టుకు వేలాడదీశారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దర్యాప్తు జరపాలని కోరుతూ పెద్దిరాజు మృతదేహంతో కొందరు యువకులు ఆస్పత్రి నుంచి స్థానిక భవానీ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.   

మరిన్ని వార్తలు