లక్కీడ్రాలో లక్షలు గెలుచుకున్నారంటూ..

5 Oct, 2020 08:58 IST|Sakshi
పోస్ట్‌ ద్వారా ఇంటికి పంపిన స్క్రాచ్‌ కార్డు, లెటర్‌ చూపుతున్న దృశ్యం

సాక్షి, కర్నూలు (శిరివెళ్ల): ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డులేకుండా పోతోంది. అమాయకులను లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా లక్కీడ్రాలో లక్షలాది రూపాయలు గెలుచుకున్నారని నాప్తాల్‌ కంపెనీ పేరుతో శిరివెళ్ల మండలవాసులకు ఎరవేశారు. వారు ఇటీవల వెలుగుచూసిన మోసాలను తెలుసుకుని అప్రమత్తమయ్యారు.  మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి సుబ్బారావు, మహమ్మద్‌ మరికొందరి అడ్రెస్‌లకు నాప్తాల్‌ కంపెనీ పేరు మీద స్క్రాచ్‌కార్డులు, లెటర్లు వచ్చాయి. లక్కీడ్రాలో రూ. 12 లక్షల నుంచి రూ.14 లక్షలు గెలుచుకున్నారని..బ్యాంక్‌ వివరాలు పంపాలని సూచించారు. అలాగే గెలుచుకున్న మొత్తం పొందేందుకు 1 శాతం ట్యాక్స్‌ తాము సూచించిన అకౌంట్‌లోకి జమ చేయాలని మెసేజ్‌లు పంపారు.  (చీటింగ్‌ కేసులో టీడీపీ నేత హరిప్రసాద్‌ అరెస్ట్‌)

రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగి పేరుపై వచ్చిన ఆన్‌లైన్‌ చెక్‌  

ఇలాగే నమ్మించి రెండు నెలల క్రితమే మండలంలోని మోత్కలపల్లెకు చెందిన ఓ యువకుడి నుంచి రూ. 8 లక్షల వరకు  లాగారు. ఈ ఘటన మరువక ముందే  కేటుగాళ్లు మళ్లీ మరికొందరికి వల విసరడంతో అనుమానం వచ్చింది. రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగికి ఏకంగా  రూ. 14 లక్షల  ఆన్‌లైన్‌  చెక్కును చూపించారు. ఆయన వారి బుట్టలో పడకుండా పోలీసులను అశ్రయించాడు. కాగా ఎవరైనా డబ్బులు గెలుచుకున్నారని మెసేజ్‌లు పంపితే స్పందించొద్దని, అలాగే నమ్మి బ్యాంక్‌ ఖాతా, ఆధార్, ఇతర వ్యక్తిగత సమాచారమివ్వొద్దని సీఐ చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు. 

మరిన్ని వార్తలు