ప్రాణం తీసిన వెయ్యి రూపాయల వివాదం

20 Jun, 2022 05:11 IST|Sakshi

బాకీ చెల్లించమని అడిగితే కర్రతో దాడి

క్షతగాత్రుడు అక్కడికక్కడే మృతి 

నూజివీడు: తనకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలను ఇవ్వమన్నందుకు వ్యక్తిని హత్య చేసిన ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురంలో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటాద్రిపురానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాసరావు (45) మండలంలోని రావిచర్లలో ఉన్న సిమెంట్‌ ఇటుక రాళ్ల కంపెనీలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంటి వద్ద అవసరమై 200 సిమెంట్‌ రాళ్లను గతంలో తెచ్చుకొని ఉంచాడు.

వాటిలో 50 రాళ్లను అదే గ్రామానికి చెందిన కూచిపూడి రంగా (30) అనే వ్యక్తి రెండు నెలల క్రితం తీసుకెళ్లాడు. వాటికి సంబంధించి వెయ్యి రూపాయలు ఇవ్వాలని, లేదంటే సిమెంట్‌ రాళ్లనైనా తిరిగి ఇచ్చేయమని శ్రీనివాసరావు అతనిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇదే విషయమై ఇద్దరూ పలుమార్లు గొడవ పడ్డారు. ఆదివారం సాయంత్రం కూడా ఇదే విషయమై వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఈ నేపథ్యంలో రంగా సమీపంలో ఉన్న కర్రతో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును స్థానికులు హుటాహుటిన నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఊహించని ఈ ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం కలిగించింది. రూరల్‌ ఎస్‌ఐ ఎం.లక్ష్మణ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు