Extramarital Affair: వివాహేతర సంబంధం.. రోజూ కలవడం కుదరదని.. ప్రియురాలి భర్తకు..

18 Aug, 2022 20:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏలూరు టౌన్‌: వసంతవాడలో వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని ప్రియుడే భర్తను కడతేర్చినట్లు తేల్చారు. ఈ కేసులో ప్రియుడు ముళ్లపూడి దిలీప్‌ను అరెస్ట్‌ చేశారు. ఏలూరు రూరల్‌ సర్కిల్‌ స్టేషన్‌లో ఏలూరు ఇన్‌చార్జి డీఎస్పీ జీవీఎస్‌ పైడేశ్వరరావు బుధవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. పెదపాడు మండలం వసంతవాడ గ్రామానికి చెందిన దిరిశిన వీర్రాజు, అగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామానికి చెందిన కలపాల లక్ష్మి అలియాస్‌ శ్రావణికి మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది.
చదవండి: మరో యువతితో పెళ్లి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు షాకిచ్చిన ప్రియురాలు

వీరిద్దరికీ ప్రస్తుతం 7 నెలల బాబు ఉన్నాడు. వివాహానికి ముందు నుంచే శ్రావణి ఈదులగూడెం గ్రామానికి చెందిన ముళ్లపూడి దిలీప్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉంది. శ్రావణి నిత్యం ఎదోక విధంగా అత్తింట్లో గొడవపెట్టుకుని పుట్టింటికి వస్తూ ఉండేది. ప్రియుడు దిలీప్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. ఇక దిలీప్‌ కూడా తరచు వీర్రాజు ఇంటికి వెళుతూ బాగా పరిచయం పెంచుకున్నాడు. ఇంటికి వెళ్లిన ప్రతి రోజూ వీర్రాజును బయటకు తీసుకువెళ్లి ఫూటుగా మద్యం తాగించి, ఇంటి వద్దకు తీసుకువచ్చేవాడు. కొద్దిరోజుల కిత్రం వీర్రాజు తన భార్యను ఇంటికి తీసుకురావటానికి గ్రామ పెద్దలను తీసుకుని వెళ్లి మాట్లాడగా ఆమె తల్లిదండ్రి అత్తారింటికి పంపేందుకు ఒప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో శ్రావణిని ప్రతి రోజూ కలవటానికి కుదరదని, తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తాడనే కారణంతో వీర్రాజును ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని దిలీప్‌ అనుకున్నాడు. ఇదే విషయాన్ని శ్రావణికి చెప్పి అదను కోసం వేచి ఉన్నాడు. ఈనెల 9న రాత్రి 10.30 గంటల సమయంలో శ్రావణి ఇంటికి వచ్చి వీర్రాజును నీతో మాట్లాడాలి రావాలని దిలీప్‌ బయటకు తీసుకువెళ్ళాడు. మద్యం తాగించి వసంతవాడ గ్రామం నుంచి గోగుంట గ్రామానికి వెళ్లే దారిలో దేవుని మాన్యం పొలం వద్దకు తీసుకువెళ్లాడు.

తనతో తీసుకువచ్చిన బ్లేడ్‌ కత్తితో వీర్రాజును వెనుక నుంచి జుట్టు పట్టుకుని వేళాకోళం చేస్తున్నట్లు తల వెనక్కి వంచి మెడపై కోసి చంపి పారిపోయాడు. మరుసటి రోజు 10వ తేదీ ఉదయం 6.30 గంటలకు స్థానికులు అతడ్ని గుర్తించి వీర్రాజు తల్లి దిరిశిన దేవమాతకు సమాచారం అందించారు. ఆమె పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏలూరు రూరల్‌ సీఐ ఎన్‌.దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో పెదపాడు ఎస్‌ఐ బీ.నాగబాబు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలించి నిందితుడు దిలీప్‌ను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన మోటారు సైకిల్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన పెదపాడు ఎస్‌ఐ నాగబాబు, రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మణబాబు, హెచ్‌సీలు డీ.సువర్ణరాజు, టీ.శంకరరావు, డీవీ రమణ, హమీద్, పీసీలు ఎన్‌.కిషోర్, డీ.ప్రదీప్‌కుమార్‌లను డీఎస్పీ అభినందించారు. 

మరిన్ని వార్తలు