కట్టలు కట్టలుగా నగదు, బంగారం.. ఏసీబీ వర్గాలే విస్మయంలో

16 Dec, 2020 09:12 IST|Sakshi
పట్టుబడిన బంగారం, నగదు

పర్యావరణ అనుమతులకు లక్షల్లో లంచం 

ఏసీబికి చిక్కిన సూపరింటెండెంట్‌

సాక్షి, చెన్నై: పర్యావరణ అనుమతుల కోసం వచ్చే పరిశ్రమల వద్ద లక్షల కొద్ది లంచం పుచ్చుకుంటున్న ఓ అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు తమ వలలో వేసుకున్నారు. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో బయటపడ్డ నగదు, ఆభరణాలు ఏసీబీ వర్గాల్నే విస్మయంలో పడేసింది. చెన్నై, సైదాపేట పనగల్‌ మాలిగైలో పర్యావరణ, కాలుష్య నియంత్రణ విభాగం కార్యాలయం ఉంది. ఇక్కడ సూపరింటెండెంట్‌గా పాండియన్‌ పనిచేస్తున్నారు. అనుమతుల కోసం వచ్చే సంస్థలు, పరిశ్రమలు ఈయన గారి చేతులు తడపాల్సిందే. లక్షల్లో లంచం పుచ్చుకునే ఈ అధికారి గుట్టును రట్టు చేస్తూ ఓ సంస్థ ఏసీబీకి రహస్యంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ఏసీబీ ఏడీఎస్పీ లావణ్య నేతృత్వంలోని బృందం పాండియన్‌పై కన్నేసింది.  చదవండి: (సోదరిపై ప్రేమ: అతడు చేసిన పని హాట్‌టాపిక్‌..)

ఈ పరిస్థితుల్లో సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పాండియన్‌ గదిలోకి ప్రవేశించిన ఈ బృందం సోదాల్లో నిమగ్నమైంది. మరో బృందం శాలిగ్రామంలోని పాండియన్‌ ఇంట్లో సోదాలు చేపట్టింది. రాత్రంతా ఈ సోదాలు సాగాయి. రెండో రోజు మంగళవారం కూడా తనిఖీలు సాగాయి. పాండియన్‌ కార్యాలయ గదిలో లక్షల కొద్ది నగదు, ఇంట్లో కట్టలు కట్టలుగా 1.5 కోట్ల నగదు బయటపడింది. రూ.7 కోట్లు విలువ చేసే 18 ఆస్తుల దస్తావేజులు చిక్కాయి. బీరువాల్లో 3 కేజీల బంగారు ఆభరణాలు, రూ. ఐదున్నర లక్షల విలువ చేసే వజ్రహారం, ఒకటిన్నర కేజీ వెండి వస్తువులు ఈ సోదాల్లో బయట పడ్డాయి. ఈ ఆస్తులు ఎలా గడించారో అన్న విషయంగా పాండియన్‌ వద్ద ఏసీబీ విచారణ సాగుతోంది.  చదవండి: (నైట్‌ క్లబ్‌లపై దాడులు.. పోలీసుల అదుపులో 275 మంది)

ఈరోడ్‌లో.. 
ఈరోడ్‌లో శ్రీపతి అసోసియేట్స్‌పై ఐటీ దాడులు సాగాయి. ఈ సంస్థ ప్రభుత్వ భవనాల నిర్మాణాలతోపాటు పలు, ప్రైవేటు సంస్థల నిర్మాణాలు చేపట్టింది. పన్ను ఎగవేత సమాచారంతో ఆదివారం రాత్రి నుంచి ఈసంస్థ కార్యాలయాలు, యజమానుల ఇళ్లల్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.16 కోట్లు విలువ చేసే నగదు, ఆస్తుల దస్తావేజులు బయట పడ్డట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు ప్రాంతాల్లో ఐటీ వర్గాలు సాగించిన దాడుల్లో రూ. 23 కోట్ల నగదు, రూ. 110 కోట్లు విలువ చేసే ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల్ని సీజ్‌ చేసినట్టు ఆ కార్యాలయం ఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.  చదవండి: (చచ్చిపో.. అంటూ చిత్రను ప్రేరేపించిన హేమనాథ్‌)

మరిన్ని వార్తలు