Arpita Mukherjee: ఆ డబ్బంతా నాది కాదు.. నాకేం తెలియదు

2 Aug, 2022 18:03 IST|Sakshi

నటి అర్పితా ముఖర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు నటి అర్పితా ముఖర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో దొరికిన డబ్బంతా తనది కాదని.. తాను లేనప్పుడు డబ్బంతా ఇంట్లో పెట్టారని ఆమె వెల్లడించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న అర్పితను మంగళవారం వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళుతున్నప్పుడు ఆమె మీడియాతో మాట్లాడారు. 

కాగా, తన ఇంట్లో దొరికిన డబ్బంతా పార్థా ఛటర్జీదేనని ఈడీ విచారణలో అర్పితా ముఖర్జీ చెప్పినట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. తన ఇంటిని మినీ బ్యాంక్‌లా ఆయన వాడుకున్నారని, డబ్బు దాచిన గదిలోకి తొంగి కూడా చూడకుండా తనను కట్టడి చేశారని వాపోయారు. అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహించి 50 కోట్ల రూపాయలకు పైగా నగదు, ఆభరణాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అర్పిత చేసిన వ్యాఖ్యలను బట్టే చూస్తే పార్థా ఛటర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే కనబడుతోంది. 

ఈడీ విచారణలో పార్థా ఛటర్జీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. అయితే తనను ఈ కేసులో ఇరికించారని పార్థా ఛటర్జీ అంటున్నారు. అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన డబ్బులు తనవి కాదని, సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు బయటపెడతానని ఆయన పేర్కొన్నారు. (క్లిక్: పార్థా ఛటర్జీకి అవమానం.. ముఖం మీదే చెప్పులు విసిరి..)

మరిన్ని వార్తలు