కుమారుడు, భార్య తన కళ్లెదుటే.. ఎంత శిక్ష వేశావు దేవుడా..

27 Oct, 2022 11:32 IST|Sakshi
చలమేశ్వరరావు, శ్రీవల్లి, ప్రహాస్‌(ఫైల్‌)

అవనిగడ్డ(కృష్ణా జిల్లా): ఆ దంపతుల అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టిందో.. లేక తల్లీబిడ్డల ప్రేమను చూసి  మృత్యువు పగబట్టిందో ఏమో.. రోడ్డు ప్రమాదం తల్లీబిడ్డల జీవితాలను నిర్ధాక్షిణ్యంగా చిదిమేసింది. భార్యాబిడ్డలను దూరం చేసి ఆ యువకుడిని ఒంటరిని చేసింది. ఎంత శిక్ష వేశావు దేవుడా.. అంటూ అతను కన్నీరుమున్నీరుగా విలపించాడు.
చదవండి: దొంగలను ఎదిరించిన మహిళ.. కత్తులతో పొడిచినా..

అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని లంకమ్మ మాన్యం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీబిడ్డలు మృత్యువాత పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక రెండో వార్డుకు చెందిన తోట చలమేశ్వరరావు, శ్రీవల్లి (32) దంపతులు. శ్రీవల్లి నడకుదురు సచివాలయంలో ఉద్యోగి. చలమేశ్వరరావు స్థానికంగా ఒక ప్రైవేటు స్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వారికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. 14 నెలల క్రితం కుమారుడు ప్రహాస్‌ జన్మించాడు. రెండు నెలల క్రితం ప్రహాస్‌ తొలి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వ హించారు. చలమేశ్వరరావు, శ్రీవల్లి దంపతులు తమ కుమారుడు ప్రహాస్‌తో కలిసి బుధవారం అశ్వారావుపాలెంలోని తమ బంధువుల ఇంట జరిగే వేడుకకు బైక్‌పై బయలుదేరారు.

లంకమ్మ మాన్యం మలుపు వద్ద ముందు వెళ్తున్న సెప్టిక్‌ ట్యాంకు ట్రాక్టర్‌ సైడ్‌ ఇవ్వడంతో చలమేశ్వరరావు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో డ్రైవర్‌ ట్రాక్టర్‌ను కుడివైపునకు తిప్పడంతో ట్రక్కు బైక్‌కు తగిలి ముగ్గురూ కింద పడిపోయారు. ప్రహాస్, శ్రీవల్లికి రోడ్డు దెబ్బలు బలంగా తగిలాయి. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహు టిన అవనిగడ్డలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే ప్రహాస్‌ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.

శ్రీవల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించింది. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న కుమారుడు, భార్య ఇద్దరూ తన కళ్లెదుటే మరణించడంతో చలమేశ్వరరావు విలపిస్తున్న తీరు చూపరులను కలచి వేసింది. ఈ ఘటనతో అవనిగడ్డ రెండో వార్డులో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు