తల్లీ, భర్తే కడతేర్చారు..

4 Mar, 2021 09:23 IST|Sakshi
తుని రూరల్‌ స్టేషన్‌లో విలేకర్లతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ, ఎస్సైలు.

వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ

చెడు ప్రవర్తనతో విసిగి హత్య చేసిన కుటుంబ సభ్యులు

అనాథలైన చిన్నారులు 

తుని రూరల్‌(తూర్పుగోదావరి): ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఒక మహిళను ఆమె భర్త.. తల్లి కలిసి అంతమొందించిన వైనమిది. తుని మండలం కొత్త వెలంపేట శివారు మామిడి తోటలో బయటపడిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు బుధవారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు వివరాలు  తెలిపారు. లోవదేవస్థానంలో సన్నాయి వాయిద్యకారుడు చింతపల్లి సత్యనారాయణ 2004లో తన అక్క కుమార్తె ఆదిలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి పదో తరగతి చదువుతున్న రమేష్‌ నాలుగో తరగతి చదువుతున్న మరో కుమారుడున్నారు. తుని మార్కండ్రాజు పేటలో ఈ కుటుంబం ఉండేది.

ఆదిలక్ష్మి కొందరితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోందని ఆమె భర్త, తల్లి సత్తెమ్మ తరచూ మందలించేవారు. పరువుపోతోందని బాధపడేవారు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో వీరిద్దరూ విసిగిపోయారు. ఈ నేపథ్యంలో గతనెల 28న సత్తెమ్మ, ఆమె అల్లుడు కలిసి ఆదిలక్ష్మి తలపై సుత్తితో బలంగా కొట్టారు. దీంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని గోనె సంచిలోకి కుక్కి స్కూటీ వాహనం ముందు పెట్టుకుని సత్యనారాయణ కొత్తవెలంపేట శివారు మామిడి తోటకు తరలించాడు. అక్కడ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

ఎవరైనా చూస్తారని వెంటనే ఇంటికి వచ్చేశాడు. అయితే మృతదేహం సగంకాలి మిగిలినభాగం ఉండిపోయింది. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. హైవే సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఈలోగా భయాందోళనకు గురైన సత్యనారాయణ, సత్తెమ్మ బుధవారం పోలీసులకు లొంగిపోయారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ వివరించారు. రూరల్‌ సీఐ కె.కిషోర్‌బాబు, ఎస్సై వై.గణేష్‌ కుమార్, సిబ్బందిని ఆయన అభినందించారు. తల్లి హత్యకు గురికాగా తండ్రి, అమ్మమ్మ అరెస్టవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆదిలక్ష్మి హత్యతో కుటుంబం చిన్నాభిన్నమయ్యింది.
చదవండి:
అంతా సినీ ఫక్కీ: 20 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..   
పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు.. 

మరిన్ని వార్తలు