లోన్‌యాప్‌: తల్లి ఫొటోలు మార్ఫింగ్‌

21 Dec, 2020 01:21 IST|Sakshi

మనో వ్యధతో యువకుడి ఫిర్యాదు

సైదాబాద్‌ ఠాణాలో కేసు నమోదు

హైదరాబాద్‌ : అప్పుల యాప్‌ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుల యాప్‌ కథలు రోజుకొకటి బయటికొస్తూనే ఉంది. తాజా అప్పు తీసుకుని సకాలంలో వడ్డీ చెల్లించలేని కారణంగా తన తల్లి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన వివరాలిలా ఉన్నాయి.. సింగరేణికాలనీకి చెందిన దావులూరి సాయి అరవింద్‌ నవంబర్‌లో మై బ్యాంక్‌ ఋణయాప్‌ నుండి రూ.2,600 రుణంగా తీసుకున్నాడు. వారం రోజుల వ్యవధిలో వడ్డీతో కలిపి రూ.3,500 చెల్లించాడు. కొద్దిరోజుల తరువాత అదే యాప్‌ నుండి రూ.30,000 లోన్‌ తీసుకున్నాడు. ఆ రుణాన్ని వారంలోపు వడ్డీతో కలిసి రూ.55,000 చెల్లించాలనేది యాప్‌ నిబంధన. రెండోసారి తీసుకున్న అప్పును అరవింద్‌ సకాలంలో చెల్లించలేకపోయాడు. దాంతో యాప్‌ నిర్వాహకులు అరవింద్‌ను బ్లాక్‌మెయిల్‌ చేయటం మొదలుపెట్టారు. అతని ఫోన్‌ నుంచి యాక్సెస్‌ చేసుకున్న కాంటాక్ట్‌ నంబర్లు, వాట్సప్‌ గ్రూపుల ద్వారా అతన్ని బహిరంగంగా అవమానించటం మొదలుపెట్టారు.

అరవింద్‌ ఫొటోలను డీఫాల్టర్‌ అంటూ అతడి స్నేహితులకు షేర్‌ చేశారు. అతని ఫొటోలను అసభ్యకరంగా మార్పింగ్‌ చేసి షేర్‌ చేశారు. అంతటితో ఆగని యాప్‌ నిర్వాహకులు అరవింద్‌ తల్లి ఫొటోలను అవమానకర రీతిలో మార్ఫింగ్‌ చేసి అతడి సన్నిహితుల నంబర్లతో క్రియేట్‌ చేసిన గ్రూపుల్లో పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. రుణం చెల్లిస్తానని చెప్పినా ఆలస్యమైనందున ప్రతీరోజుకు రూ.3000 వడ్డీ చెల్లించాలని షరతు పెట్టారు. వారి వ్యవహారశైలితో మనస్తాపం చెందిన అరవింద్‌ యాప్‌ నిర్వాహకులపై శనివారం రాత్రి సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైదాబాద్‌ పోలీసులు మైయాప్‌ నిర్వాహకులపై ఐపీసీ 384, 420, 504, 506 ఏపీ తెలంగాణ మనీ లెండింగ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 3, 13 కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు