కన్నతల్లి కొనఊపిరితోనే ఉన్నా.. ఫ్రెండ్స్‌తో పార్టీ! దిగ్భ్రాంతికర విషయాలు

10 Jun, 2022 21:31 IST|Sakshi

పబ్‌జీ కోసం కన్నతల్లిని తుపాకీతో కాల్చి చంపిన తనయుడి కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిని చంపిన తర్వాత స్నేహితులను ఇంటికి పిలిపించుకుని.. వాళ్లతో హ్యాపీగా దావత్‌ చేసుకున్నాడు మైనర్‌. అయితే తాజాగా విచారణలో అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టారు. 

పబ్‌జీ విషయంలో కన్నతల్లిపై కోపం పెంచుకుని తుపాకీతో కాల్చి చంపాడు కొడుకు. ఈ కేసులో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిని తుపాకీతో కాల్చేసిన తర్వాత ఆమెను ఓ గదిలోకి లాక్కెళ్లి తాళం వేశాడు. అయితే అప్పటికే ఆమె ప్రాణం పోలేదు. అప్పుడే కాదు.. ఆ మరుసటి రోజు ఉదయం వరకూ కూడా ఆమె కొన ఊపిరితోనే ఉంది. 

ఘటన జరిగిన రాత్రి సమయం నుంచి ఉదయం వరకూ మధ్యమధ్యలో గది తాళం తీసి ఆమె పరిస్థితిని చూస్తూ ఉండిపోయాడు ఆ కొడుకు. ఈ మధ్యలోనే స్నేహితులను ఇంటికి పిలిచి ఆన్‌లైన్‌లో ఫుడ్‌, కూల్‌డ్రింకులు ఆర్డర్‌ పెట్టి మరో గదిలో హ్యాపీగా పార్టీ చేసుకున్నాడు. ఒకవేళ తల్లికి ఇలా జరిగిందనే విషయం ఎవరికైనా చెప్పి ఉంటే.. కనీసం ఆమె బతికి ఉండేదని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు.

అంతేకాదు.. ఇంటికి వచ్చిన స్నేహిడిని తల్లి శవం మాయం చేసేందుకు సాయం పట్టాలని తుపాకీతో బెదిరించాడు. అంతేకాదు ప్రతిగా ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఉత్తర ప్రదేశ్‌లో లక్నోలో ఉంటున్న ఓ ఆర్మీ ఆఫీసర్‌ కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుంది. బెంగాల్‌లో విధులు నిర్వహిస్తున్న ఆ అధికారి.. తన సర్వీస్‌ రివాల్వర్‌ను ఇంట్లోనే ఉంచి వెళ్లాడు. కొడుకు పదే పదే పబ్‌జీ ఆడుతుండడంతో మందలించింది తల్లి సాధన(40). ఆ కోపంలో తుపాకీతో తల్లిని కాల్చేసి.. ఆమెను ఓ గదిలో, చెల్లిని(10) మరో గదిలో ఉంచాడు. రెండు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్త: తల్లి శవం ఓ గదిలో.. దోస్తులతో ఎగ్‌ కర్రీ దావత్‌

మరిన్ని వార్తలు