పార్క్‌లోని చెరువులో సహాయ కలెక్టర్‌ సస్మిత డెడ్‌బాడీ.. ఆత్మహత్య లేక హత్యా? 

22 Sep, 2023 13:46 IST|Sakshi

భువనేశ్వర్‌: అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళ మృతిచెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. అయితే, ఆమె మృతికి ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

వివరాల ప్రకారం.. రుర్కెలాలో అదనపు కలెకర్ట్‌ ఆఫీసులో రాజగంగపూర్‌ ప్రాంతానికి చెందిన సస్మిత మింజ్‌ (35) సహాయ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే, పార్కులో ఉన్న జలాశయంలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఈ నెల 15న సస్మిత విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. 17వ తేదీన ఆమె నగరంలో ఒక హోటల్లో ఉన్నట్లు తెలిసింది. తల్లి, సోదరుడు హోటల్‌కి వెళ్లి ఆమెను కలవాలని ప్రయత్నించినా అందుకు ఆమె నిరాకరించారు. అయితే, కార్యాలయంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని, తనకు విశ్రాంతి కావాలని, తాను ఎవరినీ కలుసుకోనని తెలిపారు.

ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం పార్కులో ఉన్న జలాశయంలో ఓ మహిళ మృతదేహం తేలుతూ కనిపించడంతో సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని వచ్చి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతదేహం సహాయ కలెక్టర్‌ది అని గుర్తించారు. జలాశయం తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్‌, చెప్పులు లభించాయి. ఆమె కుటుంబ సభ్యులు మృతి చెందిన సస్మిత మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.

అనంతరం, మృతదేహాన్ని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో కొంతమంది అధికారులు ఆమెను మానసికంగా వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటుందని లేదా హతమార్చి జలాశయంలో విసిరేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పార్క్‌ పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: యూపీలో మరో ఎన్‌కౌంటర్‌.. మహిళా కానిస్టేబుల్‌పై దాడిలో..

మరిన్ని వార్తలు