మేడారం అటవీ ప్రాంతంలో దారుణం.. 

3 May, 2023 09:48 IST|Sakshi

వరంగల్‌: పని కోసం రోడ్డుపై వెళ్తున్న ఓ వివాహితను కారులో ఎక్కించుకుని ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వరంగల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌ నగరంలోని 3వ డివిజన్‌ పరిధిలోని పైడిపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహిత అదే గ్రామానికి చెందిన మరో మహిళతో పని నిమిత్తం ఏప్రిల్‌ నెల 20వ తేదీ ఉదయం ఆరెపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై వెళ్తుండగా.. ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన ఎస్‌.రవి అనేవ్యక్తి ఎ.రమేశ్‌ అనే వ్యక్తితో కలసి కారులో (తెల్లరంగు బ్రెజా) వచ్చి మహిళలిద్దర్నీ ఎక్కించుకుని ములుగు వైపు బయల్దేరారు. 

ఓ మహిళ మార్గమధ్యంలోనే దిగిపోగా, కొంతదూరం వెళ్లాక ములుగు జిల్లాకు చెందిన డి.నాగరాజు, హన్మకొండకు చెందిన బి.లక్ష్మణ్, వర్ధన్నపేటకు చెందిన బి.సుధాకర్‌ అనే యువకులు కారులో ఎక్కారు. ఈ ఐదుగురు కలసి కారులో ఉన్న మహిళను బెదిరిస్తూ మేడారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ముగ్గురు యువకులు అత్యాచారం చేయగా మిగిలిన ఇద్దరు యువకులు సహకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ మహిళను బెదిరించి ములుగు తీసుకొచ్చి అక్కడ బస్సు ఎక్కించి వెళ్లిపోయారు. సదరు బాధితురాలు ములుగురోడ్డు వద్ద బస్సుదిగి తన భర్తకు ఫోన్‌ చేసింది. ఎక్కడికి వెళ్లావని నిలదీయడంతో ఆమె భయపడి కరీంనగర్‌ జిల్లాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. 

గత నెల 29న ఫిర్యాదు చేసిన భర్త..
బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఏప్రిల్‌ 25న ఏనుమాముల పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. పుట్టింటి దగ్గర ఉన్నట్లు భార్య చెప్పడంతో అక్కడకు వెళ్లిన భర్తకు సామూహిక అత్యాచారం సంగతి తెలిసింది. దీంతో బాధితురాలు, ఆమె భర్త ఏప్రిల్‌ 29న కలసి ఫిర్యాదు చేయగా పోలీసులు ఐదుగురు యువకులతోపాటు సామూహిక అత్యాచారానికి సహకరించిన మరో మహిళపై కూడా గ్యాంగ్‌రేప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అనంతరం ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు.

ఇది కూడా చదవండి: నేను నిర్దోషిని.. దేవ్, సీతలు పిలిచారనే వెళ్లా.. థాయ్‌ పేకాట వ్యవహారంపై చికోటి స్పందన

మరిన్ని వార్తలు