కిడ్నాప్‌ డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు

23 Feb, 2021 21:32 IST|Sakshi

న్యూయార్క్‌: పని నుంచి తప్పించుకునేందుకు కిడ్నాప్‌ నాటకం ఆడిన వ్యక్తి ఉద్యోగం ఊడటంతో పాటు అరెస్ట్‌ కావాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలు.. అరిజోనాలోని కూలీడ్జ్‌లోని ఫ్యాక్టరీ ఉద్యోగి బ్రాండన్‌ సోల్స్‌(19). పని నుంచి తప్పించుకునేందుకు తనకు తాను ఓ కిడ్నాప్‌ నాటకం ఆడాడు. టైర్‌ ఫ్యాక్టరీలో పనిచేసే సోల్స్‌ సమీపంలోని వాటర్‌ టవర్‌ వద్ద పడి ఉన్నాడు. నోటికి ప్లాస్టర్‌తో, అతని చేతులు బెల్ట్‌తో కట్టేసి ఉన్నాయి.

ఆ స్థితిలో ఉన్న అతడిని ఒక వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఇద్దరు వ్యక్తులు తనని కిడ్నాప్‌ చేసినట్లుగా పోలీసులు తెలిపాడు. స్పృహ కోల్పోయేలా కొట్టి వాహనంలో తీసుకుపోయి వాటర్‌ టవర్‌ వద్ద పడేసినట్లు తెలిపారు. తన తండ్రి వద్ద ఉన్న డబ్బు కోసం కిడ్నాప్‌ చేసినట్లుగా చెప్పాడు. ఇతని వాంగ్మూలంపై డిటెక్టివ్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో సోల్స్‌ కిడ్నాప్‌ నాటకం ఆడినట్లుగా తేలింది. పని నుంచి బయటపడేందుకు తన బెల్ట్‌తో తానే కట్టేసుకుని ఈ నాటకం ఆడినట్లుగా  తేలింది. దీంతో అటు ఉద్యోగం ఊడడంతో పాటు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
చదవండి: 14 ఏళ్ల బాలికను పెళ్లాడిన 50 ఏళ్ల ఎంపీ

మరిన్ని వార్తలు