బెంగళూరు అల్లర్లు: ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌

13 Aug, 2020 18:03 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజధాని డీజే హళ్లి ప్రాంతంలో మంగళవారం రాత్రి చెలరేగిన హింసాత్మక ఘర్షణలకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఐదుగురి మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ అల్లర్లలో ముగ్గురు మరణించగా.. 200 కార్లు దగ్దమయ్యాయి. డీజే హళ్లి పోలీస్‌ స్టేషన్‌ను నాశనం చేసి తగులబెట్టారు దుండగులు. ‘పోలీసులను చంపేయండి’ అంటూ ఆయుధాలు కలిగిన నిరసనకారులు నినాదాలు చేశారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి 8.45గంటలకు డీజే హళ్లి ప్రాంతంలో దాడులు ప్రారంభించారు. కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నివాసం బయట దాడులకు పాల్పడ్డారు. ఈ నిరసనలకు ప్రధాన కారణం ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. దాంతో అల్లర్లు చెలరేగాయి. (రాజుకున్న రాజధాని)

పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లోని వివరాలు..
1. రాత్రి 8:45 గంటలకు, ఐదుగురు వ్యక్తులు అర్ఫాన్, ఎస్‌డీపీఐకి చెందిన ముజ్జామిల్ పాషా, సయ్యద్ మసూద్, అయాజ్, అల్లాహ్ బక్ష్‌తో పాటు 300 మంది వీధుల్లోకి వచ్చారు. వారి చేతిలో మాచెట్స్‌, రాడ్లు వంటి ఆయుధాలు కలిగి ఉన్నారు. పోలీస్ స్టేషన్‌ మీద దాడి చేశారు.

2. వారు ‘పోలీసులను చంపండి, వారిని విడిచిపెట్టవద్దు’ అని నినాదాలు చేశారు. నిరసనకారులు పోలీసులపై ఇటుకలు కూడా విసిరారు. దాడి సమయంలో పోలీస్ స్టేషన్‌లో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీధర్ తలకు గాయమైంది.

3. పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా ఈ గుంపు అక్కడ నుంచి కదల్లేదు, విధ్వంసం కొనసాగింది. వారు కేజే హళ్లి, డీజే హళ్లి పోలీస్ స్టేషన్లలోని వాహనాలకు నిప్పంటించారు. అనంతరం ఈ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు.

4. జనసమూహాన్ని అక్కడి నంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. కాని నిరసనకారులు పోలీసులను ఉద్దేశించి ‘మిమ్మల్ని అంతం చేయకుండా ఇక్కడ నుంచి కదలం’ అని చెప్పారు. వారు బేస్‌మెంట్‌ నుంచి పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి, ‘హత్య చేయాలనే ఉద్దేశ్యంతో’ పోలీసు సిబ్బందిపై దాడి చేశారు.

5. ఎఫ్‌ఐఆర్‌లో, మూక దాడిలో చిక్కుకున్న పోలీసుల ప్రాణాలను కాపాడటానికి తాము గాలిలో ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.  అంతేకాక అర్ఫాన్, ముజ్జామిల్ పాషా (ఎస్‌డీపీఐ), సయ్యద్ మసూద్, అయాజ్, అల్లాహ్ బక్ష్ కేఎస్‌ఆర్‌పీ ప్లాటూన్ల నుంచి తుపాకులను లాక్కోవడానికి ప్రయత్నించారు. దాంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు గాల్లో ఎక్కువ రౌండ్లు కాల్పులు జరిపారు. వారిని అరెస్ట్ చేశాము అని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. 

6. సాయుధ గుంపు పోలీస్ స్టేషన్‌ మీద రాళ్ళు రువ్వడంతో ఒక పోలీసు కానిస్టేబుల్‌ గాయపడ్డారు. ఆ తర్వాత మరో 59 మంది గాయాలపాలయ్యారు

7. దుండగులు పోలీస్ స్టేషన్ వెలుపల ఆపి ఉంచిన వాహనాలను తగలబెట్టడం ప్రారంభించగానే, ఒక పోలీసు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దాంతో నిరసనకారులు పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి తలుపులు, కిటికీలు పగలగొట్టారు. పోలీసులను అంతం చేస్తామని హెచ్చరించారు. ఈ ముఠా పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కోవడానికి కూడా ప్రయత్నించింది. అనంతరం అదనపు దళాలు రావడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి నిందితులను అరెస్ట్ చేశారు. (అలా చేస్తే చర్యలు తప్పవు: డీజీపీ)

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు ఓ వర్గంపై సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌తో మంగళవారం రాత్రి హింస చెలరేగింది. అల్లరిమూకను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి తెగబడటంతో పాటు పోలీస్‌ వాహనాలకు నిప్పంటించారు. డీజే హళ్లి పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి కనిపించిన వస్తువులను ధ్వంసం చేశారు. కాగా బెంగళూర్‌లో జరిగిన హింసాకాండకు బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధికారులను ఆదేశించారు. హింసాకాండకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేసిన వారి నుంచే నష్టాలను రికవరీ చేస్తామని చెప్పారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా