బీటెక్ విద్యార్థిని హత్య కేసు: నిందితుడు అరెస్ట్‌

16 Aug, 2021 18:45 IST|Sakshi

సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసులు పట్టుకునే సమయంలో నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. పోలీసులను చూసి శశికృష్ణ గొంతు కోసుకోవడానికి యత్నించాడని చెప్పారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రమ్య హత్యా ఘటన అత్యంత దురదృష్టకరమని, స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించామని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నాని, నిందుతున్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

యువతులు, మహిళలపై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవన్నారు. జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఘటన జరిగిన తక్షణం వేగంగా స్పందించి కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులకు అభినందనలు తెలిపారు. విచారణ త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి సత్వరం కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మహిళల రక్షణ తమ ప్రథమ కర్తవ్యమని, అందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు.

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న సమయంలో నిందితుడు శశికృష్ణ తన గొంతును కత్తితో కోసుకోవడానికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గాయపడిన శశికృష్ణను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. శనివారం కాకాని రోడ్డులో బీటెక్‌ విద్యార్థిని రమ్యను శశికృష్ణ హత్య చేసిన విషయం తెలిసిందే. విద్యార్థినిని నిందితుడు దారుణంగా రోడ్డు మీదనే కత్తితో పొడిచి చంపాడు. 

మరిన్ని వార్తలు