సామాజిక న్యాయానికి ప్రతిరూపం జగనన్న పాలన

17 Nov, 2023 01:40 IST|Sakshi
బీద మస్తాన్‌రావు, శివకుమార్‌, రాధిక రమేష్‌లకు గజమాల వేసిన అభిమానులు

తెనాలి: దేశచరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతోందని, దీనికి తనలాంటి ఎందరో ప్రత్యక్ష నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ బీద మస్తాన్‌రావు అన్నారు. తెనాలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేసిన తాడిబోయిన రాధికరమేష్‌ అభినందన సభను గురువారం సాయంత్రం పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ ర్యాలీ అనంతరం స్థానిక శివాజీచౌక్‌లో ఏర్పాటైన బహిరంగ సభకు మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ 35 ఏళ్ల టీడీపీ పాలనలో లేదా 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు హయాంలో రాజ్యసభకు బీసీలను ఎంపిక చేసిన దాఖలా లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎనిమిది రాజ్యసభ సీట్లకు అవకాశమొస్తే, అందులో నలుగురిని బలహీనవర్గాల నుంచి ఎంపిక చేయటం చిరస్మరణీయమైన మైలురాయిగా అభివర్ణించారు. 25 మంది మంత్రుల్లో 17 మంది, 48 మంది ఎమ్మెల్సీల్లో 28 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని చెప్పారు. శాసనసభ స్పీకర్‌తో సహా, శాసనమండలిలోని కీలక పదవుల్లోనూ, ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురిని ఆ వర్గాలనే నియమించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతోందన్నారు. బడుగులకు ఎలాంటి రాజ్యాధికారం కల్పించని చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నిలబెట్టుకోలేదని మస్తాన్‌రావు గుర్తుచేశారు. బడుగులకు రాజ్యాధికారంతోపాటు సంక్షేమంతో వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తోడుగా ఉండాలనే సంకల్పంతో 30 ఏళ్లుగా ఉంటున్న టీడీపీని వదిలేసినట్టు మస్తాన్‌రావు చెప్పారు. ఓసీ మహిళకు రిజర్వు అయిన తెనాలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని తొలివిడతగా ముస్లిం మైనారిటీకి, ఇప్పుడు బీసీ యాదవ మహిళకు ఇవ్వడం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ సాహసానికి నిదర్శనమన్నారు. పట్టణంలో ఏదైనా అభివృద్ధి పనికి తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయిస్తానని మస్తాన్‌రావు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ తన ప్రసంగంలో, సంక్షేమం, అభివృద్ధి బాటలో పయనిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాటలోనే నియోజకవర్గంలో ఎన్నడూ అవకాశాలు దక్కని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్నామని చెప్పారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, ఎంపీపీ, వైకుంఠపురం ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌ ఎంపికలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలుగా చెప్పారు. కార్యక్రమంలో ఇంకా మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ అత్తోట నాగవేణి, దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు మన్నవ ప్రభాకర్‌, కావేటి నిర్మల, రాళ్లబండి సుష్మ, పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాళి శేషాచలం, షేక్‌ దుబాయ్‌బాబు, పార్టీ నేతలు తాడిబోయిన రమేష్‌, తట్టుకూళ్ల అశోక్‌యాదవ్‌, తిరుమలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు.

రాజ్యాధికారంలో

బడుగు వర్గాలకు పెద్దపీట

సంక్షేమంతో పేదల ఆర్థికాభివృద్ధి

రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు

మరిన్ని వార్తలు